జిల్లా స్థాయిలో పేదలకు మెరుగైన వైద్యం అందాలి.. పేదలు అప్పులపాలు కావొద్దు: మంత్రి దామోదర
‘వైద్యం కోసం పేదోడు అప్పులపాలు కావొద్దు.. సర్కార్ ఆసుపత్రికి వెళ్తే అభద్రత భావానికి గురి కావొద్దు’ పల్లె దవాఖాన నుంచి పట్నంలోని టీచింగ్ హాస్పిటల్ వరకు క్వాలిటీ ట్రీట్మెంట్ అందాలి.
దిశ, తెలంగాణ బ్యూరో: ‘వైద్యం కోసం పేదోడు అప్పులపాలు కావొద్దు.. సర్కార్ ఆసుపత్రికి వెళ్తే అభద్రత భావానికి గురి కావొద్దు’ పల్లె దవాఖాన నుంచి పట్నంలోని టీచింగ్ హాస్పిటల్ వరకు క్వాలిటీ ట్రీట్మెంట్ అందాలి. దీని వలన సర్కా రీ వైద్యంపై పేదోడికి భరోసా కలుగుతుంది. ట్రీట్మెం ట్ డీ సెంట్రలైజ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇం దుకోసం జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ హాస్పిటల్స్ లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తరహాలోనే సేవ లు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో సిటీ ఆసుపత్రులపై పేషెంట్ల లోడ్ ఆటోమెటిక్ గా తగ్గుతుంది. ప్రజారోగ్య సంరక్షణ ప్రభు త్వం బాధ్యత. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఎవరు ఎన్ని విమర్శించినా, అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించినా.. మా లక్ష్యం ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో తొలి విడతలో 80 శాతం ఇన్ ఫ్రా స్ట్రక్చర్, సిబ్బందిని రిక్రూట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని కొద్ది నెలల్లోనే సంపూర్ణంగా పూర్తి చేస్తాం. కొత్త నిర్ణయాలు, విధానాలతో పేదోడికి మేలు చేయాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం.. అంటూ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కీలకమైన వైద్యారోగ్యశాఖలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులపై ఆయన ఆదివారం ‘‘దిశ” తో షేర్ చేసుకున్నారు. ఆ ముచ్చట్లన్నీ ఆయన మాటల్లోనే..
దిశ: మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశాఖలో వచ్చిన మార్పులేంటి..?
మంత్రి: కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రెట్టింపు చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినం. 11 ఏళ్లుగా పెండింగ్ ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను 20 శాతానికి పెంచాం. న్యూక్లియర్ మెడిసిన్, ఇంటర్‌వెన్షనల్ రేడియాలజి వంటి ఖరీదైన వైద్య సేవలను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. 2014 నుంచి 2023 అక్టోబర్ వరకు నెలకు సగటున రూ.52 కోట్లు ఖర్చు చేస్తే, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు నెలకు సగటున రూ.76 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే ఆరోగ్య శాఖలో 7774 పోస్టులు భర్తీ చేశాం. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా మరో 6470 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాటు త్వరలో మరో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 1690 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) పోస్టులు, 308 ఫార్మసిస్ట్(ఆయుష్) పోస్టుల భర్తీకి త్వరలోనే మెడికల్ బోర్డు నోటిఫికేషన్లు ఇవ్వనున్నది.
పెండింగ్ లోని 8 మెడికల్ కాలేజీల పర్మిషన్లు తెచ్చినం. దీంతో తెలంగాణకు మరో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా వచ్చాయి. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఉస్మానియా నూతన భవనానికి శ్రీకారం చుట్టాం. రెండు వేల కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో అన్ని విభాగాలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబోతున్నాం. జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు, ఎంఎల్ హెచ్ పీలకు సకాలంలో జీతాలు ఇచ్చేందుకు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశాం. కొత్తగా 18 డయాలసిస్ సెంటర్లను పెంచి పాత కేంద్రాల్లో 89 మిషన్లను సమకూర్చాం. మాత, శిశు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల తరహాలో ప్రతి జిల్లాలో ఎన్ సీడీ క్లినిక్ లను అందుబాటులోకి తెచ్చాం. దీని ద్వారా దాదాపు 50 లక్షల మంది కి వైద్యం అందుతుంది. అంతేగాక పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు మాతృత్వం కోసం పరితపిస్తున్న దంపతుల కోసం ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందిస్తున్నాం. గాంధీ , పేట్ల బురుజులో ప్రారంభించాం. త్వరలో కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో అందుబాటులోకి తెస్తాం. అంబులెన్స్ సంఖ్యను 790 నుంచి 1003కి పెంచాం. ఇక ట్రామకేర్ సెంటర్లు, మైత్రి క్లినిక్స్ ఏర్పాటు తో పాటు పుడ్ సేప్టీపై స్పెషల్ ఫోకస్ పెంచాం. టాస్క్ ఫోర్స్ తో తనిఖీలు నిర్వహిస్తున్నాం. జీవన్ దాన్ ను ప్రక్షాళన చేసి, కొత్త ఆఫీసర్లను నియమించాం. సీనియారిటీ ప్రకారం పబ్లిక్ హెల్త్, డీఎంఈ పోస్టులకు అధికారులను కేటాయించాం. పుడ్, డ్రగ్ కంప్లైంట్ లకు కలెక్టరేట్లలో ఫిర్యాదు ల కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఏళ్ల తరబడి నుంచి పెండింగ్ లో ఉన్న ట్రాన్స్ ఫర్ల ప్రాసెస్ ను పూర్తి చేశాం.
దిశ: ఆరోగ్య శాఖ ప్రక్షాళన ఎలా ఉండబోతోంది?
మంత్రి: ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ చాలా కీలకమైనది. ప్రజలతో నేరుగా కనెక్టివిటీ కలిగిన విభాగం ఇది. అందుకే దీనిపై రెట్టింపు స్థాయిలో ఫోకస్ పెట్టి పనిచేయాల్సి ఉంటుంది. పబ్లిక్ హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్..ఈ మూడు విభాగాల ఆసుపత్రులలో 80 శాతం ఇన్ ఫ్రా స్ట్రక్చర్, స్టాపును సమకూర్చాలని టార్గెట్ పెటుకున్నాం. మరికొద్ది నెలల్లోనే ఆ టాస్క్ సంపూర్ణవంతమవుతుంది. క్యాన్సర్ చికిత్స కొరకు రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం. ఇక మెడిసిన్ పంపిణీపై ఫోకస్ పెంచాం. ప్రభుత్వాసుపత్రులలో ప్రైవేట్ మెడికల్ షాపులు లేకుండా చర్యలు తీసుకోబోతున్నాం. ప్రభుత్వ సెక్టార్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లకు ఇన్సెంటీవ్స్, స్టాఫ్కు అన్ని రకాల సౌలత్ లు కల్పించేందుకు సర్కార్ చొరవ తీసుకోనున్నది. టీవీవీపీని సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరీగా మార్చేందుక కసరత్తు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇబ్బంది తలెత్తకుండా ఓ బలమైన వ్యవస్థ ఉండేలా అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజీ నిపుణులతో అధ్యయనం చేయించాం. టీవీవీపీ ఉన్నతాధికారులతో కలిసి ఆస్కి రూపొందించిన ప్రతిపాదనలపై ఇటీవలే సమీక్ష చేశాం. ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటాం.
దిశ: ఉస్మానియా నూతన భవనం, టిమ్స్ ఆసుపత్రులను ఎలా తీర్చిదిద్దుతున్నారు..?
మంత్రి: ఉస్మానియా హాస్పిటల్ తెలంగాణకు తలమానికం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా అనేక రాష్ట్రాల నుంచి వస్తున్న రోగులకు చికిత్స అందిస్తున్న దవాఖాన. దశాబ్దాల చరిత్ర కలిగిన ఉస్మానియా దవాఖాన స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్ల పాటు నిర్లక్ష్యానికి గురైంది. అందుకే ప్రజాప్రభుత్వం గోషామహల్‌లో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మించాలని నిర్ణయించింది. దాదాపు రూ.2 వేల కోట్లతో సువిశాలమైన ఆస్పత్రి భవనాలు నిర్మించి, ప్రజలకు అందించబోతున్నాం. జనరల్ మెడిసిన్ నుంచి అంకాలజీ వరకు అన్ని విభాగాల ఏర్పాటుతో పాటు అత్యాధునిక వసతులు, ఆపరేషన్ థియేటర్లు ఉండనున్నాయి. దీంతో పాటు టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. త్వరలో వరంగల్ ఆసుపత్రి ప్రారంభం కానున్నది.
దిశ: ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫీజులను ఎలా నియంత్రిస్తారు..?
మంత్రి: ఎవరైనా చట్టం, రూల్స్ ప్రకారం ముందుకు సాగాల్సిందే. కరోనా నుంచి ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై దోపిడి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఇప్పటికీ కొన్ని ఆసుపత్రులు కంటిన్యూ చేస్తూనే ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. వీటిని అరికట్టేందుకు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ టీమ్స్ ను ఏర్పాటు చేశాం. నిబంధనల ప్రకారం లేని ఆసుపత్రులను తప్పకుండా సీజ్ చేస్తాం. అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. ఇక మెడికల్ షాపులు, డయాగ్నస్టిక్ కేంద్రాలపై కూడా సర్కార్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. త్వరలోనే యాక్షన్ ప్లాన్ ఉంటుంది.
దిశ: ఉద్యోగులు, జర్నలిస్టుల స్కీమ్ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు..?
మంత్రి: ఉద్యోగులు పదేళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం మా దృష్టిలో ఉంది. వారు కోరుకున్నట్టుగా ఈహెచ్‌ఎస్‌ను అమలు చేస్తాం. భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా కొత్త వ్యవస్థను రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన సిస్టంను తీసుకురాబోతున్నాం. కొత్త స్కీమ్‌ల కంటే, ఆరోగ్యవంతమైన ప్రజల సమాజం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం.
దిశ: కొత్త మెడికల్ కాలేజీలపై ఎన్ఎంసీ తిరకాసేంటి..?
మంత్రి: 2024–2025 అకాడమిక్ ఇయర్ లో 8 కాలేజీలకు గత ప్రభుత్వం ప్రపోజల్ తయారు చేసింది. కానీ అందుకు అవసరమైన సౌకర్యాలు, స్టాఫ్ను నియమించడంలో ఫెయిలైంది. దీంతో పర్మిషన్ల అంశంలో నేషనల్ మెడికల్ కమిషన్ కఠినతరంగా వ్యవహరించింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలోనే, అన్ని సవాళ్లను అధిగమిస్తూ 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చినం. ములుగు, నారాయణపేట్, మెదక్, గద్వాల్, కుత్బుల్లాపూర్, నర్సంపేట్, మహేశ్వరం, యాదాద్రిలో కాలేజీలు, హాస్పిటళ్లను ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా తీర్చి దిద్ది, నేషనల్ మెడికల్ కమిషన్‌ను, కేంద్ర ఆరోగ్యశాఖను ఒప్పించి, మెప్పించి కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చినం. దీంతో ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున, మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇక ఏడాది కాలంలోనే 16 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నాం. దీంతో సీట్ల సంఖ్య 1400 నుంచి 2360కి పెరిగింది. అంతేగాక కొత్తగా 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించగా, సీట్ల సంఖ్య 1492 నుంచి 3172కు పెరిగింది. నర్సింగ్ కాలేజీలు, పారామెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం 500 కోట్లు కేటాయించింది.