అన్ లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్‌తో లాభాలు
‘హైదరాబాద్ ప్రాంతంలో నాలాలు, చెరువులను ఆక్రమించినోళ్ల మీద చర్యలు తీసుకుందామనుకున్నాం. అక్రమాలను కూలగొడుతామంటే కొందరు గగ్గోలు పెడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘హైదరాబాద్ ప్రాంతంలో నాలాలు, చెరువులను ఆక్రమించినోళ్ల మీద చర్యలు తీసుకుందామనుకున్నాం. అక్రమాలను కూలగొడుతామంటే కొందరు గగ్గోలు పెడుతున్నారు.రియల్ ఎస్టేట్ పడిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన డిమాండ్ అండ్ సప్లై లో తేడా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎకరానికి 5 లక్షల చ.అ.ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు. దీంతో 25 ఎకరాల్లో 3200 ఫ్లాట్లు వచ్చాయి. ఒక్కో ఫ్లాట్ కి మూడు కార్లు అంటే 10 వేల కార్లు రోడ్డెక్కితే ఎట్లా ఉంటుంది? ఉదయం ఆఫీసుకి వెళ్లేటప్పుడు అందులో 1/3 కార్లు అంటే 3500 కార్లు 25 ఎకరాల నుంచి రోడ్డు ఎక్కితే ట్రాఫిక్ జాం కాదా? 30 వెంచర్లు ఒక్క దగ్గర ఉంటే లక్ష కార్లు ఉంటున్నాయి. నగరాన్ని ఇట్లా సర్వనాశనం చేశారు’’ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగమిది.
గత ప్రభుత్వం భూములను వేలం వేస్తే ఎకరానికి రూ.100 కోట్లు పలికింది. ఇంత ధర పలికితే కొనుగోలు చేసిన కంపెనీకి లాభాలు ఎలా సాధ్యమనే సందేహాలు కూడా సామాన్యుల్లో కలిగాయి. కానీ అంతకంటే ఎక్కువ పెట్టినా హైదరాబాద్ పరిసరాల్లో ఎలాంటి నష్టం రాదు. పైగా రెట్టింపు సంపాదించే మార్గం ప్రభుత్వ విధానాల్లోనే ఉన్నది. గత ప్రభుత్వం అలాంటి సదుపాయమే కల్పించింది. అందుకే రూ. వందల కోట్లు పెట్టి స్థలాలను సొంతం చేసుకునేందుకు కంపెనీలు పోటీ పడ్డాయి. సదరు కంపెనీలు ఎవరి బినామీ? వాటిల్లో డైరెక్టర్లు ఎవరు? వారు ఏ పార్టీకి సంబంధించిన వారు? అన్న విషయాలతో సంబంధం లేదు. ఎవరు కొనుగోలు చేసినా లాభాలు తెచ్చే పెట్టే బాధ్యత అప్పటి ప్రభుత్వం తీసుకున్నది.
రెట్టింపు సంపాదనకు మార్గం!
ముందు స్థలాన్ని దక్కించుకోవాలి. ఇష్టమొచ్చినట్లు కట్టుకోవాలి. ఎన్ని అంతస్థులైనా నిర్మించుకోని, ఎంత ప్రాజెక్ట్ నైనా ప్లాన్ చేసుకోని.. సింగిల్ విండో ద్వారా ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చేశారు. అన్నింటికీ తామే గ్యారంటీ అన్నట్లుగా హెచ్ఎండీఏ వ్యవహరించింది. అందుకే గ్రీన్ ఫీల్డ్ గ్రోత్ సెంటర్ అంటూ బుద్వేలులోని 100 ఎకరాల వేలం పాటలోనూ అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ(ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) అని ప్రకటించారు. అదొక్కటే ప్రచారాస్త్రంగా మారింది. అంటే పది ఫ్లోర్లకు బదులుగా 20 ఫ్లోర్లు వేసి ఆ పెట్టుబడికి రెట్టింపు సంపాదించుకునే మార్గాన్ని ప్రభుత్వమే కల్పించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలన్నీ హైదరాబాద్‌కి వచ్చాయి. ఒక్కో డెవలపర్‌కి పెట్టిన పెట్టుబడికి 200 శాతం లాభాలు ఆర్జించడానికి అన్ లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనే వెసులుబాటు పనికొస్తున్నది. మరిప్పుడు? ఇలాంటి అన్ లిమిటెడ్ ఫ్లోర్ స్పెస్ ఇండెక్స్‌కి అవకాశం ఉంటుందా? ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి మదిలో ఏమున్నది? అంటూ రియల్ ఎస్టేట్, డెవలపర్లలో హాట్‌టాపిక్‌గా మారింది.
అన్ లిమిటెడ్‌పై చర్చ జరగాల్సిందే
కోకాపేట గోల్డ్ మైల్ లే అవుట్‌లో ఎస్ఏఎస్ క్రౌన్ పేరిట 4.5 ఎకరాల్లో 228 మీటర్ల ఎత్తులో 57 అంతస్థులు, తెల్లాపూర్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ మై హోం కన్స్ట్రక్షన్ ‘మై హోం సయూక్’ ప్రాజెక్టు పేరిట 25.37 ఎకరాల్లో 12 టవర్లు, 39 అంతస్తులతో నిర్మాణాన్ని చేపట్టింది. గచ్చిబౌలిలో ప్రెస్టేజ్ హై ఫీల్డ్స్ 35 అంతస్తులు, కొండాపూర్‌లో ఎస్ఎంఆర్ వినయ్ 35 అంతస్తులు, పుప్పాలగూడలో మై హోం అవతార్ లో 31 అంతస్తులు, మణికొండలో ల్యాంకో హిల్స్ 35 అంతస్తులు, కేపీహెచ్బీలో లోథా బెల్లెజ్జా 39 అంతస్తులు.. ఇప్పుడు కోకాపేట, బుద్వేలులోనూ హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. ఇలాంటి ఆకాశ హార్మ్యాలు సౌకర్యవంతం కోసమేనా? నగరాల్లో స్థలాలు దొరకక ఎత్తైన భవంతులు నిర్మిస్తారు. అప్పుడు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) ఎంత ఉండాలన్న షరతులతో కూడిన అనుమతులు ఇస్తారు. మరి ఇక్కడెందుకు ఈ సిస్టం అమలు కావడం లేదు? హై రైజ్ బిల్డింగుల వల్ల తలెత్తే పర్యావరణ విఘాతాలపై చర్చ జరగాల్సిందే.
మొబైల్ కంపెనీ సాహసం
కోకాపేటలో వేలం పాటలో స్థలాన్ని దక్కించుకున్న కొన్ని కంపెనీలకు నిర్మాణ రంగంలో ఎలాంటి అనుమతులు లేవు. కానీ రాజ పుష్ప, మై హోం వంటి కంపెనీలను ఢీకొట్టింది. ఐతే వేలం పాటకు ముందే దీంట్లో సుమారు 100 మంది డెవలపర్లు/కస్టమర్లు/ఇన్వెస్టర్లు జత కట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతి ఒక్కరూ ముందుగానే అవసరమైన డబ్బును సమకూర్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని ప్రచారం. నియోపొలిస్ ఫేజ్-2లో గల 3.6 ఎకరాల ప్లాట్‌ను హ్యాపీ మొబైల్స్ కంపెనీ సొంతం చేసుకున్నది. నిజానికి దానికి ఎలాంటి అనుభవం లేదు. వేలంలో మిగతా కంపెనీలతో పోటీ పడి ఎకరానికి రూ.100.75 కోట్లు పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత పెట్టినా నష్టం లేదన్న ధీమాతో ఉన్నది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వేలం పాటల వెనుక అన్ లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ దాగి ఉన్నది. అంతేకాకుండా ఎంఎస్ఎం ఫార్మాకెమ్, నవిత్రిస్ ఇన్వెస్ట్మెంట్స్, రాజ పుష్ప ప్రాపర్టీస్, వంటి అనేక కంపెనీలు, వివిధ గ్రూపులు ఎకరానికి కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోళ్లు చేశారు. వీరంతా హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించి అంతకంతా సంపాదించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎఫ్ఎస్ఐ అంటే?
– బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్‌కి ముందే అది రెసిడెన్షియలా, కమర్షియలా, ఎత్తు ఎంత? ఏరియా ఎంత? వీటినే ప్రాథమికంగా అంచనా వేస్తారు.
– ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) అంటే మొత్తం అంతస్తుల విస్తీర్ణం/ప్లాట్ విస్తీర్ణం
– ప్లాట్ విస్తీర్ణం= 2000 చ.అ. మొత్తం నిర్మించిన విస్తీర్ణం 4,000 చ.అ.లు అనుకుంటే
– ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) = 4,000/2000 = 2
– ఎఫ్ఎస్ఐ ఒక నగరానికి 2 గా ఉంటే.. ప్లాట్ విస్తీర్ణం 2000 చ.అ. లు అనుకుంటే బిల్టప్ ఏరియా రెండింతలు అన్న మాట. అంటే 4000 చ.అ.ల వరకు నిర్మించుకోవచ్చు. ఇక హైదరాబాద్‌లో ఏ రేంజ్ లో కట్టుకోవడానికి అనుమతులు లభిస్తాయో మీరే అంచనా వేయండి.
- హైదరాబాద్‌లో ఎఫ్ఎస్ఐ తాజాగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల తీరును పరిశీలిస్తే ఎఫ్ఎస్ఐ 10కి పైగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.