బాంబు బెదిరింపులతో పబ్లిక్‌లో ఫియర్.. రాంగ్ కాల్స్‌తో ఆకతాయిల ఆటలు
రాష్ట్రంలో వరుస బాంబు బెదిరింపుల కలకలం మరోసారి చోటుచేసుకుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వరుస బాంబు బెదిరింపుల కలకలం మరోసారి చోటుచేసుకుంది. రెండు రోజుల్లో మూడు చోట్ల బాంబు బెదింరిపులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బాంబు కలకలం జరిగిన ప్రదేశాలు కూడా ప్రభుత్వ కార్యాలయాలు కావడంతో మరింత కలవరం మొదలైంది. మేడ్చల్- మల్కాజ్ గిరి కలెక్టరేట్ ను పేల్చేస్తాం అంటూ బాంబు బెదిరింపు మెయిల్ గురువారం వచ్చింది. వెంటనే నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు మెసేజ్ రావడంతో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందనే విషయం పోలీసులకు సవాలుగా మారింది. గురువారం ఘటనలు మరవకముందే శుక్రవారం ఉదయం వరంగల్ కోర్టును పేల్చేస్తామని మెయిల్ వచ్చింది.. ఒక్క ప్రభుత్వ కార్యాలయాలకే కాకుండా గతంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సైతం బాంబు బెందిరింపు కాల్స్ వచ్చాయి.. హైదరాబాద్ పరిధిలో పలు స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
కలకలం రేపుతున్న తాజా ఘటనలు..
మేడ్చల్ - మల్కాజ్ గిరి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపులకు పాల్పడింది కరీంనగర్ కు చెందిన మాజీ మావోయిస్ట్ ముప్పా లక్ష్మణ్ రావుకు చెందిన మెయిల్ నుంచి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పెల్చేస్తామని మెయిల్ వచ్చినట్లు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కు బాంబు బెదిరింపులు అల్లాహు అక్బర్ అనే పేరుతో మెసేజ్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వరంగల్ కోర్టుకు మాత్రం ఫోన్ కాల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనల్లో వచ్చిన సమాచారం అంతా ఫేక్ సమాచారంగా పోలీసు అధికారులు ధ్రువీకరిస్తున్నా ప్రజల్లో కొంత కలవరపాటు చోటు చేసుకుంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపులు
గత అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మూడు విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి చండీ గఢ్ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించా రు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విమా నంలో తనిఖీలు చేపట్టారు. విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికులపే కిందకు దింపి చెక్ చేశారు.
హైదరాబాద్‌లోని పలు స్కూళ్లకు..
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గత అక్టోబర్, జనవరి నెలల్లో వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ నెలలో హైదరాబాద్ జవహర్ నగర్ సీఆర్పీఎఫ్ స్కూల్ కు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా సీఆర్పీఎఫ్ స్కూళ్లకు కు వచ్చినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. 2025 జనవరి 28న నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు మెయిల్ ద్వారా బాంబు బెది రింపు వచ్చింది. అంతకు ముందు కూడా రెండు సార్లు ఆకతాయిలు బెదిరింపులకు పాల్పడ్డారని స్కూల్ సిబ్బం ది తెలుపుతున్నారు. ఈ ఘటన మరువక ముందే జనవ రి 29న బొల్లారం ఆర్మీ స్కూల్ కు మెయిల్ ద్వారా బాం బు బెదిరింపు వచ్చింది. పోలీసుల తనిఖీల్లో స్కూల్లో ఎ లాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు.
ఆకతాయిల పనైతే వదిలిపెట్టొద్దు
ఘటనలలో సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్కాడ్ లను పిలిపించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కానీ ఎక్కడ బాంబులు వంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించడం జరుగుతోంది. అసలు ఇలాంటి బెదిరింపులకు ఎవరు పాల్పడుతున్నారనే అంశంపై పోలీసుల దర్యాప్తు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆకతాయిల పనిగా భావిస్తే మాత్రం అసలు విడిచిపెట్టొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.