ఒక్కటవుదాం.. ఒత్తిడి తెద్దాం.. T-కాంగ్రెస్‌లో ఏకమవుతోన్న ‘బీసీ’ బలగం..!
కర్ణాటక రిజల్ట్ తర్వాత ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు నిర్దిష్ట ఎజెండాతో ఒక్కటవుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక రిజల్ట్ తర్వాత ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు నిర్దిష్ట ఎజెండాతో ఒక్కటవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోగా మిగిలిన జనరల్ సీట్లలో కనీసం సగం బీసీ అభ్యర్థులకు కేటాయించేలా ఒత్తిడి పెరుగుతున్నది. వివిధ సామాజికవర్గాలకు చెందిన బీసీ నేతలంతా ఈ విషయంలో ఒక్కటవుతున్నారు.
మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల నివాసంలో రెండు రోజుల క్రితం బీసీ నేతలు చర్చలు జరిపారు. ఇతర పార్టీల్లో బీసీలు గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దానిపై ఎందుకు ఫోకస్ పెట్టకూడదనే చర్చ జరిగింది. రాష్ట్రంలోని మొత్తం జనరల్ నియోజకవర్గాల్లో 47 సీట్లను బీసీలకు ఇచ్చేలా పట్టుబట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హైకమాండ్‌కు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు.
బీఆర్ఎస్ ఎత్తుకు.. పైఎత్తు
ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు బీసీ ఓటు బ్యాంకు మీద కన్నేశాయి. నిన్నమొన్నటివరకూ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండడంతో ఆయన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు కన్సాలిడేట్ అయ్యారనే భావన నెలకొన్నది. ఇప్పుడు కిషన్‌రెడ్డికి అధ్యక్ష పదవి షిఫ్ట్ కావడంతో ఆ ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కులవృత్తుల బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయంతో వారికి చేరువ కావడానికి ఇప్పటికే రోడ్ మ్యాప్ తయారైంది. ఈ నెల 15 నుంచి లాంఛనంగా ఈ స్కీమ్ పట్టాలెక్కుతున్నది. దీంతో కాంగ్రెస్ నాయకులు కూడా బీసీలను ఆకర్షించాలనే భావనతో పార్టీపైన ఒత్తిడి తీసుకొచ్చి గణనీయంగా టికెట్లు పొందాలనుకుంటున్నారు.
గత ఎన్నికల్లో ఇలా..
కాంగ్రెస్ పార్టీ బీసీలకు దగ్గర కావడం కోసం బీసీ డిక్లరేషన్‌ను పెట్టాలనుకుంటున్నది. ఇందుకోసం ప్రాథమిక కసరత్తు ఇప్పటికే మొదలైంది. రానున్న రోజుల్లో బీసీ అగ్రనేత చేతుల మీదుగా ఈ డిక్లరేషన్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నది. ఇదే సమయంలో పార్టీలోని బీసీ నేతల్లో కూడా వీలైనన్ని ఎక్కువ టికెట్లను దక్కించుకునేలా ఒకే రాగం అందుకోనున్నారు.
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014 ఎన్నికల్లో 31మంది బీసీ అభ్యర్థులకు పోటీచేసే అవకాశం లభించింది. 2018 ఎన్నికల్లో అది 24కు తగ్గిపోయింది. యాదవ సామాజికవర్గానికి టికెట్లు ఇవ్వలేదంటూ బహిరంగంగానే పార్టీ నాయకత్వంపై విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి బీసీ నేతలు టికెట్ల గురించి వారి మనసులోని అభిప్రాయాలను బహిర్గతం చేశారు.
47 స్థానాలు సముచితం..
మొత్తం పది ఉమ్మడి జిల్లాల్లో ఏయే నియోజకవర్గాల్లో బీసీ ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్నదో, గెలవడానికి అవకాశాలు ఉన్నాయో జాబితాను దగ్గర పెట్టుకుని మాజీ ఎంపీ వీహెచ్, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మరికొందరు చర్చించుకున్నారు. దాదాపు 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ ఓటు బ్యాంకు 55శాతం నుంచి 70శాతం మేరకు ఉన్నదని పేర్కొన్నారు. బీసీ నేతలందరినీ ప్రచారంలోకి దించడం, కులాలవారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించడం, వారిని మొబిలైజ్ చేసేలా కసరత్తు చేస్తే ఆ ఓటు బ్యాంకును చేజిక్కించుకోవచ్చని యోచిస్తున్నారు.
ఆ ప్రకారం రాష్ట్రం మొత్తం మీద 47 స్థానాలను బీసీలకు ఇవ్వడం సముచితంగా ఉంటుందన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఇదే జాబితాను ఏఐసీసీకి, పీసీసీకి కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నాన్-బీసీ వర్గాలకు చెందిన వ్యక్తులు గెలవడానికి ఆస్కారం ఉన్న స్థానాల్లో బీసీలకు ఇస్తే పార్టీకి చేదు అనుభవాలు ఎదురవుతాయనే లాజిక్‌తో వీరు ఏకీభవించడంలేదు. ఇతర పార్టీల్లో బీసీ అభ్యర్థులు గెలవడానికి అవకాశాలున్నప్పుడు కాంగ్రెస్‌లో ఎందుకు ఉండవనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు పోగా బీసీలకు విజయావకాశాలు ఉన్న నియోజకవర్గాలు...
ఆదిలాబాద్ : ఆదిలాబాద్, ముధోల్
నిజామాబాద్ : ఆర్మూరు, బాన్సువాడ, నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ
కరీంనగర్ : కోరుట్ల, రామగుండం, పెద్దపల్లి, వేములవాడ, హుజూరాబాద్
మెదక్: సిద్దిపేట, నారాయణ్‌ఖేడ్, నర్సాపూర్, పటాన్‌చెరు
రంగారెడ్డి: మల్కాజిగిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, తాండూరు
హైదరాబాద్: ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, సనత్‌నగర్, గోషామహల్, యాకుత్‌పుర, సికింద్రాబాద్
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్‌నగర్, కొల్లాపూర్, వనపర్తి
నల్లగొండ: మిర్యాలగూడ, సూర్యాపేట మునుగోడు, భువనగిరి, ఆలేరు
వరంగల్: జనగాం, నర్సంపేట్, పరకాల, వరంగల్ ఈస్ట్, వెస్ట్, పాలకుర్తి
ఖమ్మం: కొత్తగూడెం
Also Read..
దూకుడు పెంచిన జూపల్లి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సత్తా చాటేలా భారీ స్కెచ్!