BC Dedicated Commission: రాష్ట్రంలో బీసీలు 56 శాతం! బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సిద్ధం
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ కమిషన్ తుది నివేదికను సంక్రాంతి లోపు సర్కారుకు అందజేయనుంది. ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన కులగణన సర్వే డేటాను డెడికేటెడ్ కమిషన్ అవసరమైన మేరకు తీసుకోనుంది. రాష్ట్రంలో క్యాస్ట్‌సెన్సస్ సర్వే ఇప్పటికే పూర్తయింది. డేటా కంప్యూటరీకరణ పూర్తయినట్టు ప్రభుత్వం వర్గాలు గతంలోనే తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా 56 % బీసీలు ఉన్నట్టు గుర్తించారు. గతంలో నిర్వహించిన బహిరంగ విచారణలో వచ్చిన అంశాలతో పాటు ఇతర విషయాలను డెడికేటెడ్ కమిషన్ పరిశీలిస్తోంది.
జనాభాలో 50 శాతానికిపైగా బీసీలు ఉంటే గ్రామాల్లో రిజర్వేషన్ వారికే ఇవ్వాలని దరఖాస్తులు డెడికెటేడ్ కమిషన్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీసీలకు రిజర్వేషన్లు ఎంత శాతం ఉండాలి..? ఎలా అమలు చేయాలి..? వీటి అమలు వల్ల ఏవైనా న్యాయపరమైన చిక్కులు వచ్చే చాన్స్ ఉందా..? స్థానిక సంస్థల రిజర్వేషన్లలలో న్యాయపరమైన అంశాల్లో చిక్కులు రాకుండా ఉండేందుకు ప్రతి అంశాన్ని నిపుణులతో చర్చించేందుకు తుది కసరత్తును చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేటర్లు సేకరించిన డేటాను ఆన్‌లైన్ చేయడం పూర్తి కాగా, ఆ రిపోర్టును ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు అందజేసింది. బీసీ కమిషన్‌లో సమాచారాన్ని క్రోడీకరించి ఫైనలైజ్ చేసేందుకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరావు నేతృత్వంలో పరిశీలిస్తున్నారు.
భట్టి సూచనల మేరకు నివేదికలో మార్పులు చేర్పులు
కులగణన సర్వే తుది డ్రాఫ్ట్ దాదాపు పూర్తికావడంతో దీనిపై చర్చంచేందుకు డెడికేషన్, బీసీ కమిషన్, ప్రణాళిక విభాగం అధికారులు డిప్యూటీ సీఎంను కలిసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ అడిగినట్టు తెలిసింది. ఈ వారంలో తుది నివేదికతో భట్టితో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం ఇచ్చే సూచనలను తీసుకొని.. నివేదికలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. అనంతరం పంచాయతీరాజ్ శాఖతో కూడా సమావేశం కానున్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ రాజ్ శాఖ కీలకం కానున్న నేపథ్యంలో ఈ శాఖతోనూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇదంతా సంక్రాంతి లోపు చేయాలని డెడికేటెడ్ కమిషన్ భావిస్తోంది. ఆ రిపోర్టు సర్కారుకు చేరిన తర్వాత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పూర్తి సమాచారం రానుంది.
ఫైనల్ రిపోర్టులో బీసీలు 2 శాతంపెరిగే ఛాన్స్
ప్రణాళిక విభాగం చేసిన కులగణన సర్వే ఆధారంగా రాష్ట్రంలో 56 శాతం వరకు బీసీలే ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది. డేటాను పూర్తిగా క్రోడీకరించి.. తయారుచేసే తుది జాబితాలో ఈ సంఖ్య 2 శాతం పెరిగే అవకాశాలు లేకపోలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతిలోపు ఎలాగైనా నివేదికను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేయాలన్న సంకల్పంతో బీసీ డెడికేటెడ్ కమిషన్ ఉంది. తుది నివేదికను త్వరలోనే కేబినెట్‌లో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.