Bathini Brothers : చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ మృతి
చేపమందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ మృతి చెందారు.
దిశ, ముషీరాబాద్ : అస్తామా, శ్వాస, దగ్గు సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడే లక్షలాది మంది ప్రజలకు ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ ( 84 ) అనారోగ్యంతో చనిపోయారు. 40 సంవత్సరాలుగా ఆయన షుగర్‌తో బాధ పడుతున్నారు. ఆయనకు భార్య సుమిత్రాదేవి, కూతుర్లు అల్కానంద, అర్చన, కొడుకులు అనిల్ గౌడ్, అమర్ నాథ్ గౌడ్ సంతానం. వీరిలో అల్కానంద, అనిల్ గౌడ్ అమెరికాలో ఉంటున్నారు.
బత్తిని హరినాథ్ గౌడ్ చనిపోయారని తెలియగానే ఆయన అభిమానులు, గతంలో అనారోగ్య సమస్యలతో ఉండి నయం అయిన వారు కవాడిగూడలో ఉన్న ఆయన పార్థీవదేహాన్ని చూసేందుకు తరలివచ్చారు. బత్తిని హరినాథ్ గౌడ్ మృతిలో కవాడిగూడలో విషాదచాయలు అలుముకున్నాయి. రేపు ( శుక్రవారం ) బన్సిలాల్ పేట స్మశాన వాటికలో హరినాథ్ గౌడ్ అంత్యక్రియలు జరుగనున్నట్లు ఆయన కుమారుడు అమర్ నాథ్ గౌడ్ ‘దిశ’ ప్రతినిధితో తెలిపారు.
ముత్తాత నుంచి వారసత్వంగా..
బత్తిని హరినాథ్ గౌడ్ ముత్తాత్త బత్తిని వీరన్న గౌడ్ 1845లో దూద్ బౌలిలో శంకర్ లేన్ లో ఈ చేప మందు పంపిణీని ప్రారంభించారు. ఆ తర్వాత హరినాథ్ గౌడ్ తండ్రి శంకరయ్య గౌడ్ కొన్ని సంవత్సరాలు చేప మందు పంపిణీని కొనసాగించారు. ఆయన చనిపోవడంతో హరినాథ్ గౌడ్ నాన్నమ్మ సత్తమ్మ చేపమందు పంపిణీని కొనసాగించారు. ఆ తర్వాత హరినాథ్ గౌడ్ ఈ చేపమందు పంపిణీని వారసత్వంగా తీసుకొని ప్రతి ఏటా నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పంపిణీ చేస్తున్నారు. ఆయన అనారోగ్య సమస్యలతో ఉండడంతో ఆయన కొడుకులు ఈ సంవత్సరం జూన్ నుంచి చేప మందు పంపిణీ బాధ్యతను తీసుకున్నారు.
పాతబస్తీలోనే విద్యాభ్యాసం..
బత్తిని హరినాథ్ గౌడ్ తాతకు దూద్ బౌలితో పాటు గౌలిగూడలో ఇళ్లు ఉండేవి. బత్తిని హరినాథ్ గౌడ్ తల్లిదండ్రులు గౌలిగూడలో ఉండేవారు. హరినాథ్ గౌడ్ గౌలిగూడ నుంచి మదీన వద్ద ఉండే స్కూల్ లో చదివారు. ఆ తర్వాత సిటీ కాలేజిలో చదివారు. గ్రాడ్యుయేషన్ బిఎస్సి వరకు చదివారు.
పలు సంఘాల సత్కారాలు..
అస్తామా, శ్వాస, దగ్గు సంబంధిత వ్యాధులతో ఇబ్బందులుపడే లక్షలాది మంది ప్రజలకు చేపమందు ఇచ్చి బత్తిని హరినాథ్ గౌడ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి అగర్వాల్ సేవా దల్, అగర్వాల్ సమాజ్, పంజాబి సేవా సమితి తదితర సంఘాలు ఆయన్ను గతంలో సన్మానించి, ప్రశంసా పురస్కారాలను అందచేశారు.