Bandi Sanjay: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. కుండబద్దలు కొట్టిన బండి సంజయ్
తెలంగాణలో కమల సారథి మార్పు ఉంటుందని పార్టీలో ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కమల సారథి మార్పు ఉంటుందని పార్టీలో ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం ఓ అంచనాకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త రథ సారథి ఎవరు అనే ఉత్కంఠకు అతి త్వరలోనే తెరపడనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్(Etela Rajender), డీకే అరుణ(DK Aruna), రఘునందన్ రావు(Raghunandan Rao)తో పాటు బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా.. ఈ వార్తలపై బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. తనకు పార్టీ నాయకత్వం అంతకంటే పెద్ద బాధ్యతలు అప్పగించిందని అన్నారు. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నాకు మళ్లీ రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇస్తారనేది ఊహాగానాలే అని కొట్టిపారేశారు. కొన్ని శక్తులు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యక్తిగతంగా తనకు, పార్టీకి రెండిండికి నష్టం చేయడమే వారి లక్ష్యం అన్నారు. పార్టీ అధ్యక్షుడి విషయంలో హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రకటన చేస్తారని తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని వెల్లడించారు. ఈ విషయంలో మీడియా సహకరించాలని రిక్వెస్ట్ చేశారు.