Bandi sanjay: వరదలపై మంత్రి పొంగులేటితో చర్చించిన కేంద్ర మంత్రి

తెలంగాణలో వరదలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సమాచారం అందించామని, పలు రాష్ట్రాల నుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

Update: 2024-09-01 10:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వరదలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సమాచారం అందించామని, పలు రాష్ట్రాల నుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వరద ప్రమాదాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలోని ఖమ్మంలో తీవ్ర పరిస్థితి నెలకొన్నదని, జిల్లాలోని 110 గ్రామాలు నీట మునిగిపోయాయని చెప్పారు. ప్రకాష్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరా తండా కొండపై 68 మంది, 42 మంది భవనాలపై చిక్కుకుపోయారని అన్నారు.

వీటిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సమాచారం అందించామని, దీంతో హోంమంత్రి ఆదేశాల మేరకు చెన్నై, విశాఖపట్నం, అస్సాం నుంచి మూడు చొప్పున 9 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపించారని అన్నారు. అలాగే సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు సీనియర్ ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. అంతేగాక రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో తెలంగాణలో పరిస్థితి, కొనసాగుతున్న సహాయక చర్యలపై చర్చించినట్లు వెల్లడించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తమ ప్రయత్నాలను సమకాలీకరించాలని, సహాయక చర్యలను సమర్ధవంతంగా నిర్వహించాలని కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని ఎక్స్ లో రాసుకొచ్చారు.



 




 


 




Similar News