బీఆర్ఎస్ హయాం కంటే ఎక్కువ అవినీతి ఇప్పుడే జరుగుతోంది?
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటించారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. వేల కోట్లు దోచుకొని ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో అతిపెద్ద స్కామ్ జరిగిందని తెలిపారు. రైస్ మిల్లర్లతో నాయకులు కుమ్మక్కు అయ్యారని విమర్శించారు. రైస్ మిల్లర్ల నుంచి ఏ నాయకుడికి ఎంత ముట్టిందో విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు.. పౌర సరఫరాల శాఖ నష్టాల్లో ఎందుకు ఉందో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాళేశ్వరం తర్వాత అతిపెద్ద స్కాం పౌరసరఫరాల శాఖలో జరిగిందని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 590 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే... కేసీఆర్ 290 టీఎంసీలకే అంగీకరించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడినట్లే కాంగ్రెస్ కూడా అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంత వరకు ఒక్కరైతు ఖాతాలో కూడా రూ.500 బోనస్ పడలేదని చెప్పారు.