Bandi Sanjay vs Revanth Reddy: ‘అబద్ధాల సీఎం రేవంత్ రెడ్డికి ఆ దమ్ముందా..?’ ఫైర్ అయిన బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధమని, రేవంత్ రెడ్డి పెద్ద అబద్ధాలకోరని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Update: 2024-11-10 06:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధమని, రేవంత్ రెడ్డి పెద్ద అబద్ధాలకోరని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర వెళ్లి ప్రచారం చేయడం కాదని, దమ్ముంటే తెలంగాణలో ప్రచారం చేయాలని సవాల్ విసిరారు. నిన్న (శనివారం) రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డికి అనేక సవాళ్లు విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ నది పాదయాత్ర కాదని, 6 గ్యారెంటీలు అమలు చేశామంటూ పాదయాత్ర చేయగలుగుతారా..? అని ఛాలెంజ్ చేశారు. ‘మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ భారీ యాడ్ ఇచ్చింది. మరి తెలంగాణలో అమలు చేశామని చెప్పుకుంటున్న 6 గ్యారెంటీల ప్రస్తావన అందులో ఎందుకు లేదు? మహిళలకు రూ.2,500 ఇచ్చారా..? తులం బంగారం - స్కూటీ ఇచ్చారా..? రైతులకు రూ.500 బోనస్ ఇచ్చారా.? వ్యవసాయ శాఖా మంత్రే స్వయంగా ఇంకా 2 లక్షల మందికి రుణమాఫీ చేయాలని అన్నారు కదా.. మరి వాళ్లందరికీ రుణమాఫీ చేశారా..? రైతు భరోసా రెండో విడత ఇచ్చారా..? తరుగు, తాలు, తేమ ప్రస్తావన లేకుండా పండించిన ప్రతి గింజ కొటాం అన్నారు. మరి కొంటున్నారా..? ఆసరా బిడ్డ చొప్పున రూ.4 వేలు ఇస్తామన్నారు. మరి ఇచ్చారా..? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి చేశారా..? రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా..?

విద్యా భరోసా కార్డ్ ఇస్తామన్నారు. ఇచ్చారా..? ఇవన్నీ 6 గ్యారెంటీల్లో భాగమే కదా..? కాదని చెప్పగలరా..? మరి ఎందుకు ఇవ్వలేదు..? ఇవ్వకుండా ఇచ్చామని అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు..?’’ అని బండి సంజయ్ నిలదీశారు. మహారాష్ట్ర వెళ్లి గ్యారెంటీలన్నీ అమలు చేశామంటూ రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడని, తాము కూడా అక్కడకు వెళ్లి కాంగ్రెస్ బండారం బయటపెడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే 60 శాతం మంది రైతులు తమకు రుణమాఫీ అందలేదని చెప్పారని, అందుకే ఆ సర్వే రిపోర్టులు బయటకు రిలీజ్ చేయడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు. హిమాచల్‌లో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి కర్ణాటక ప్రజల్ని మోసం చేసి గెలిచిన కాంగ్రెస్.. కర్ణాటకలో అమలు చేస్తున్నామని చెప్పి తెలంగాణలో గెలిచిందని, ఇప్పుడు మళ్లీ మహారాష్ట్రలో కూడా అదే అబద్ధం చెప్పి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోందని బండి సంజయ్ మండిపడ్డారు. కానీ హర్యానా ప్రజలు ఎలాగైతే కాంగ్రెస్ కుట్రను కనిపెట్టి కర్రు కాల్చి వాత పెట్టారో.. మహారాష్ట్రలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. 


Similar News