ఆ బ్రిడ్జికి నిధులు ఇవ్వండి: గడ్కరీని కోరిన బండి సంజయ్

ఢిల్లీలో నితిన్ గడ్కరీని బండి సంజయ్ కలిశారు..

Update: 2024-12-18 16:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రవాణా సదుపాయాల అభివృద్ధికి రూ.224 కోట్ల మేరకు సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఈఎఫ్) నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లి పోతూరు రోడ్ , బావూపేట ఖాజీపూర్ వరకు మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం సహా మొత్తం 90 కి.మీల మేరకు రోడ్డు విస్తరణ పనులకుగాను రూ.224 కోట్ల నిధులు మంజూరు చేయాలని బండి సంజయ్ విజ్ఙప్తి చేశారు.

సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనను తెలిపారు. కేశవపట్నం-పాపయ్యపల్లె మీదుగా సైదాపూర్ వరకు 15 కి.మీల, . కొడిమ్యాల-గోవిందారం మీదుగా తాండ్రియాల వరకు 30 కి.మీల, చొప్పదండి మండలం అర్నకొండ -గోపాల్ రావు పేట మీదుగా మల్యాల చౌరస్తా వరకు 45 కి.మీల, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్-సింగారం మీదుగా ముస్తాబాద్ మండలం రాంరెడ్డి పల్లె వరకు 15 కి.మీల మేరకు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్‌గా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి గడ్కరీ త్వరలోనే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు.


Similar News