దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబాన్ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఆదివారం జనగామ జిల్లా మొండ్రాయిలోని గిర్ని తండాలో ఉన్న మెడికో ప్రీతి నివాసానికి వెళ్లిన బండి సంజయ్.. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికో ప్రీతి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలోనే మృతి చెందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రీతి కుటుంబ సభ్యులను బెదిరించి డెడ్ బాడీ తీసుకెళ్లారని బండి సంజయ్ ఆరోపించారు. మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరిపించరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ ప్రీతి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనను ఇంతటితో వదిలేది లేదని.. విచారణ జరిపే దాకా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న అత్యాచారాలకు నిరసనగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష చేపడుతున్నట్టు బండి సంజయ్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. మెడికో ప్రీతి కుటుంబాన్ని పరామర్శించాడానికి వెళ్లిన బండి సంజయ్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్యాయ్ ఎదుట బైఠాయించి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తరుఫున ప్రీతి కుటుంబానికి ఏం చేస్తారో చెప్పాలని బండి సంజయ్‌ను నిలదీశారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే రంగప్రవేశం చేసినా పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు.