దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. కాలేజ్‌లో జరిగిన ఓ గొడవ విషయంలో తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ నుండి సస్పెండ్ చేశారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై శనివారం విచారణపై చేపట్టిన ధర్మాసనం భగీరథ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బండి భగీరథను క్లాస్‌లకు అనుమతించాలని యూనివర్శిటీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
కాగా, బండి భగీరథ గతంలో యూనివర్శిటీలో తోటి విద్యార్థులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను సస్పెండ్ చేస్తూ యూనివర్శిటీ నిర్ణయం తీసుకుంది.