మంత్రి జగదీష్ రెడ్డితో వివాదం.. : DCMS చైర్మన్ వట్టే జానయ్య కీలక వ్యాఖ్యలు (వీడియో)

బహుజనులను తొక్కేస్తున్నారని డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య తెలిపారు.

Update: 2023-08-18 07:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బహుజనులను తొక్కేస్తున్నారని డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య తెలిపారు. తక్కువ శాతం ఉన్నవారికే ప్రియారిటీ ఇస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలు తృప్తి పడే రోజులు లేవన్నారు. బీఆర్ఎస్ లో సిట్టింగ్ లకే టికెట్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దిశ’ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను పంచుకున్నారు.

ప్రశ్న: మీ రాజకీయ నేపథ్యం, ఎక్కడ మొదలైంది? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?

జవాబు: స్వరాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యింది. లోకల్‌లో వార్డు మెంబర్ నుంచి సూర్యపేట్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా, సర్పంచ్‌గా, ఎంపీటీసీ, ఎంపీపీగా పనిచేశాను. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గా, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ నేతగా కొనసాగుతున్నాను. నా భార్య సైతం సర్పంచ్‌గా, కౌన్సిలర్‌గా పనిచేసింది.

ప్రశ్న: ఎందుకు ఇతరుల కోసం పనిచేశారు? ఎందుకు సొంతంగా ఎదగలేకపోయాడు? అణిచివేతకు గురయ్యారా?

జవాబు: నా రాజకీయ ప్రస్థానం లో ఎక్కడ కూడా బ్రేక్ అనేది పడలేదు. నేను ఏ పార్టీలో ఉన్న ప్రజల మద్దతు నా వెంటే ఉంది. కానీ ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా నాకు ఆ స్థాయి అవకాశాలు ఇవ్వలేదు.

ప్రశ్న: మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల్లో గెలవడానికి మీ పాత్ర కూడా ఉందా? టికెట్ కోసం మీరెందుకు ప్రయత్నం చేయలేదు? అర్హత లేదనుకున్నారా?

జవాబు: అవును, మమ్మల్ని పైన ఉన్న పార్టీలు కూడా గుర్తించాలి. పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే బహుజన వాదం బయటికి వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారు ఇంకా రాజకీయాల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చర్చ జరుగుతుంది. బహుజనుల్లో ఆలోచన మొదలైంది. ఎప్పుడు మీరేనా, మా జాతిలో అర్హత ఉన్నవాళ్లు ఉన్నారని బీసీ, కుల సంఘాల్లో ఆందోళన, చర్చ మొదలైంది.

ప్రశ్న: బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందాయా? లేదా?

జవాబు: బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు తప్ప.. రాజకీయంలో వాట ఇచ్చే పరిస్థితి లేదు. బడుగు బలహీన వర్గాల్లో తెలివైన వారు ఉంటే అతన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మా జిల్లాలోనే కాదు.. రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ఐదు శాతం ఉన్న వారికే ప్రయారిటీ ఇస్తున్నారు. కింది స్థాయి వారికి గొర్రెలు, బర్రెలు, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటే సంతృప్తి పడే స్థాయిలో బహుజనులు లేరు. బహుజనులు చదువుకున్నారు. తెలివి, అర్హత ఉంది. మా వాటా మాకు దక్కాలనే పోరాటం బహుజనులు చేస్తూనే ఉన్నారు. స్కీంల తోటి సరిపెట్టుకునే పరిస్థితి లేదు.

ప్రశ్న: బీఆర్ఎస్ పార్టీ ఈ సారి గెలుస్తదా? వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలంటే ఏం పాటించాలి?

జవాబు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాలు పోరాటం చేశాయి. సిట్టింగ్ లకే టికెట్ ఇస్తామనుకుంటా పోతే.. సెకండ్ క్యాడర్ లో ఎవరైతే బలమైన వ్యక్తులు ప్రజల మన్నన పొందిన వారికి టికెట్ ఇవ్వాలి. కచ్చితంగా సిట్టింగ్ లకే టికెట్ ఇస్తే సెకండ్ క్యాడర్ అంత నిరుత్సాహం తోనే ఉంటది. అన్ని పార్టీలు కూడా ఇది ఆలోచన చేయాలి.

ప్రశ్న: బీఆర్ఎస్‌కు, మంత్రి జగదీశ్ రెడ్డితో  వట్టే జానయ్యకు చెడిందా?

జవాబు: అలా ఏమీ లేదు. ఆత్మాభిమానంతో రాజకీయాల్లో పనిచేస్తాం. అణిచివేస్తే తట్టుకునే వాతావరణం తెలంగాణలోనే లేదు. ప్రేమిస్తే సావాసం చేయడానికి సిద్ధం. లేదంటే ఎవరి దారి వారు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నిజాయితీగా పనిచేశాం. మా పాత్ర ఏమిటో ప్రజలను అడిగితే తెలుస్తుంది. కానీ పనిచేసిన వారిని పక్కన పెట్టి.. పని చేయని వ్యక్తులకు పదవులు ఇస్తున్నారు. అవి చూస్తూ కుర్చునే వారు ఎవరు లేరు.

ప్రశ్న: తొక్కేస్తున్నారని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారా?

జవాబు: అధిష్టానం ఒక ఎమ్మెల్యేతో తప్ప రెండో క్యాడర్‌తో మాట్లాడిన చరిత్ర లేదు. అధిష్ట్రానాన్ని కలవడానికి ట్రై చేశాం. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్యేనే క్యాడర్ తో మాట్లాడడు.. ఇంకా అధిష్టానం సెకండ్ క్యాడర్‌తో ఏం మాట్లాడుతుంది. కింది స్థాయి శ్రేణులతో చర్చలు జరిపేది బీఆర్ఎస్ పార్టీలో లేదు. అయిన కూడా పార్టీ కోసం పనిచేశాం.

ప్రశ్న: సూర్యాపేట నియోజకవర్గం పరిస్థితి ఏంటీ?

జవాబు: రాజకీయంగా సూర్యాపేట నియోజకవర్గం ప్రస్తుతానికి ఎటు అంచనా వేసే పరిస్థితి లేదు. ఎన్నికల వాతావరణ నేపథ్యంలో ప్రజల్లో చర్చ మొదలైంది. ఇంకా ఏ పార్టీ గెలుపొందుతుందో ముందు ముందు తెలుస్తుంది.


Tags:    

Similar News