Harish Rao: మా సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తండి హరీష్ రావుకు ఆటో యూనియన్ నాయకుల విజ్ఞప్తి
ఎన్నికల ముందు 12వేలని నమ్మించి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని అధికార పార్టీపై ఆటో యూనియన్ నేతలు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీలో రైతుల రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వంతో ఏ రకంగా కొట్లాడుతున్నారో అదే రకంగా మా సమస్యలపై సభలో గళం విప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు (Harish Rao) ఆటో యూనియన్ నాయకులు (Auto Union Leaders) విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ లో హరీశ్ రావును ఆటో యూనియన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా తాము పడుతున్న కష్టాలు, ఆవేదన గురించి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రూ.12 వేలు ఇస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా 15 రూపాయలు కూడా ఇవ్వలేదని మొరపెట్టుకున్నారు.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ టో ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ఊసే లేదని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట నిలుపుకోలేదని హరీశ్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్థిక సమస్యలతో ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలను, వారి బతుకులను దృష్టిలో పెట్టుకొని, 12000 ఆర్థిక సాయం ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో నిలదీయాలని, అమలు అయ్యేదాకా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడతానని ఈ సందర్భంగా హరీశ్ రావు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో (Congress Manifesto) ఇచ్చిన రూ.12 వేల ఆర్థిక సహాయం సహా, ఇతర అన్ని హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టబోమన్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లపుడూ మీకు అండగా ఉంటుందని ఆటో యూనియన్ నాయకులకు ధైర్యం చెప్పారు.