మోడీపై అభిమానంతో ఆటోవాలా గొప్ప మనసు ..నెటిజన్ల ప్రశంసలు
తమ అభిమాన సిని తారలు, రాజకీయ నాయకులు పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం.
దిశ, డైనమిక్ బ్యూరో:తమ అభిమాన సినిమా తారలు, రాజకీయ నాయకులు పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పై ఉన్న అభిమానంతో ఓ ఆటో వాలా చేస్తున్న పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఈ ఆటోవాలా సర్వీస్ అదుర్స్ అంటూ కితాబిస్తున్నారు. అసలే ఆటో తోలుకుని బతికే వాళ్ల జీవితాలు అంతంత మాత్రాంగా ఉంటున్నాయనే టైమ్ లో నిర్మల్ జిల్లా సిద్ధాపూర్ గ్రామానికి చెందిన కందుల రవి అనే వ్యక్తి తన ఆటోలో గర్భిణీ స్త్రీలు, వికలాంగులకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాడు. ఈ మేరకు ఆటో వెనకాల ఫ్రీ జర్నీకి సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకు సంబధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే రవి చేస్తున్న పనికి పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రవికి సొంతంగా ఆటో లేదని అద్దె ఆటో నడుపుకుంటున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అద్దె ఆటో నడుపుకుంటూనే సమాజిక సేవ చేస్తున్న రవి సేవల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.