అరబిందో రియాల్టీకి కష్టాలే! కీలక అంశాల్లో నో క్లారిటీ?
రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన రియల్ ఎస్టేట్ సంస్థ అరబిందో రియాల్టీకి కష్టాలు వీడడం లేదు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన రియల్ ఎస్టేట్ సంస్థ అరబిందో రియాల్టీకి కష్టాలు వీడడం లేదు. ఎండీ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయ్యారు. బెయిల్ వస్తుందో లేదో తేలడం లేదు. గతేడాది నవంబరు 10న ఆయన్ని ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. 70 రోజుల నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. ఐతే ఆయనకు శుక్రవారం బెయిల్ వస్తుందేమోనని అరబిందో గ్రూపు ఉద్యోగులతో పాటు ఈ సంస్థలో ఫ్లాట్లు కొన్నవారు ఆసక్తిగా ఎదురు చూశారు.
కానీ కేసు 25వ తేదీకి వాయిదా పడింది. బెయిల్‌పైనే వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో బయ్యర్స్ అయోమయానికి గురవుతున్నారు. సౌత్ గ్రూపు పేరిట అరబిందో రియాల్టీ ఎండీ శరత్ చంద్రారెడ్డి దాదాపు రూ.600 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపిస్తున్నది. ఈడీ సమర్పించిన సప్లిమెంటరీ ఛార్జ్ షీటుపై సీబీఐ స్పెషల్ కోర్టు ఈ నెల 28న నిర్ణయం తీసుకుంటుంది.
దీంతో కేసు సీరియస్‌గా మారుతుందన్న ప్రచారం నెలకొన్నది. ఓ వైపు ఆయన మద్యం సిండికేట్‌లో పెద్ద మొత్తంలో డబ్బు వెంచించారన్న ఆరోపణ నిజమైతే ఎక్కడెక్కడి నుంచి సమకూరాయని ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్లాట్ల యజమానులు వణికిపోతున్నారు. ఆన్‌లైన్, చెక్కుల ద్వారా పేమెంట్ చేసిన వారికి ఆ స్థాయిలో ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందని లెక్కలు కడితే తమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రాజెక్టుల కొనసాగింపుపై సందిగ్థత నెలకొన్నది. ముందుకా? వెనక్కా? అన్న కోణంలో డెవలపర్స్ చర్చించుకుంటున్నారు.
ఫ్లాట్లను రద్దు చేసుకుంటారా?
అరబిందో రియాల్టీ ఎండీ శరత్ చంద్రారెడ్డి అరెస్టయి 70 రోజులైనా బయటికి రావడం లేదు. ఐతే అరబిందో రియాల్టీ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం పడలేదని సంస్థ రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో పత్రికల్లో భారీ ప్రకటనలను విడుదల చేస్తున్నది. విస్తృతంగా ప్రచారం చేసుకునే పనిలో పడింది. ఐతే గతంతో పోల్చితే ఈ సంస్థల ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొనడానికి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదని సమాచారం.
ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎవరెవరు ఎంతెంత పెట్టుబడులు పెట్టారనే అంశంపై ఈడీ దృష్టి సారిస్తే తమ పేర్లు బయటికొస్తాయనే భయం ఇన్వెస్టర్లలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే అరబిందో ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొన్నవారు రద్దు చేసి వేరే ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొనుగోలు చేయాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. అలాంటి వారిలో నమ్మకాన్ని నిలబెట్టేందుకే సంస్థ ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్కసారి కొనుగోలుదారుల విశ్వసనీయతను కోల్పోతే మళ్లీ నిలబెట్టుకోవడం కష్టం. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అరబిందో రియాల్టీ ఎలా అధిగమస్తుందో వేచి చూడాలి.
సకాలంలో పూర్తయ్యేనా?
ఢిల్లీ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డికి ఉచ్చు బిగుసుకుంటున్నట్లు అనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆయన డైరెక్టర్‌గా కొనసాగుతున్న కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. ఐతే కొనుగోలుదారులతో సంబంధం ఉన్న రియాల్టీపైనే దుష్ప్రభావం ఎక్కువగా చూపుతుందని రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మాదాపూర్, కొండాపూర్‌లో కొహినూర్, రీజెంట్, పెరల్ వంటి నిర్మించతలపెట్టిన ఆకాశహర్మ్యాల పరిస్థితి ఏమిటో అర్ధం కావడం లేదు. ఆయా ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బయ్యర్స్‌కి ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టులు పూర్తి చేసి ఫ్లాట్లను హ్యాండోవర్ చేయగలరా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read...