సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి హేయనియం : కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలకు పాల్పడిన 60 లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబం.. ప్రజాప్రతినిధి నుంచి కార్యకర్త వరకు ప్రతీ ఒక్కరికి అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

Update: 2024-09-23 15:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలకు పాల్పడిన 60 లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబం.. ప్రజాప్రతినిధి నుంచి కార్యకర్త వరకు ప్రతీ ఒక్కరికి అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేసి విధ్వంసం చేసే ప్రయత్నం చేశారనే విషయం తెలుసుకొని సోమవారం ఫోన్ చేసి పరామర్శించారు. ఘటన వివరాలను ఆరా తీశారు. యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపైన పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీత లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలేమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. అసలు ప్రభుత్వానికి ఎందుకంత భయం? కమిటీ తన పని తాను చేసుకొని పోతే నిజం బయటపడుతుందనా? అసమర్థ చేతగాని ప్రభుత్వం అసలు రంగు బయట పడుతుందనా? అని ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వం ఏమీ దాచటం లేదంటే బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీని దర్యాప్తు చేయనివ్వాలని కోరారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అవేవి జరగవద్దన్న ఇగో తో వ్యవహరిస్తున్నాడని, తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని, ఇలాంటి పిచ్చి పనులను సీఎం మానేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ఎన్ని పిరికిపంద చర్యలకు పాల్పడిన ప్రజారోగ్య వ్యవస్థ లోపాలను ఎత్తిచూపుతామని స్పష్టం చేశారు.

కల్లబొల్లి మాటలు జెప్పి పెద్దమనుషులను కూడా కాంగ్రెస్ మోసం చేసిందని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు. 2వేల ఆసరా పెన్షన్లతో కేసీఆర్ అవ్వ- తాతలకు భరోసా నింపారన్నారు. బొడ్లె సంచి బరువు పెంచి అమ్మమ్మ-నాయనమ్మల గౌరవం పెంచారన్నారు. కానీ 4 వేలు ఇస్తా అని జూటా మాటలు చెప్పి మేమిచ్చిన పింఛన్ కూడా సరిగా ఇవ్వని రేవంత్ సర్కార్ ఇయ్యాల పండు ముసలవ్వలను సైతం రోడ్డుమీదకు తీసుకొచ్చారని మండిపడ్డారు. మొన్న గద్వాల్ లో, నేడు మానకొండూరు పోలీసుస్టేషన్ లో వృద్ధ దంపతులు నిరసన అన్నారు. రేవంత్... నీకు అవ్వలు రోడ్డెక్కితే సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తక్షణమే హామీని అమలు చేసి అవ్వలకు 4 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Similar News