బోసిబోయిన తెలంగాణ భవన్.. ఎన్నికల వేళ సందడి కరువు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లయింది అన్నట్లుగా తెలంగాణ భవన్ పరిస్థితి మారింది. సీన్ రివర్స్ అయింది.
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లయింది అన్నట్లుగా తెలంగాణ భవన్ పరిస్థితి మారింది. సీన్ రివర్స్ అయింది. గతంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే తెలంగాణ భవన్ నేతలతో కళకళలాడేది. అన్ని జిల్లాల నుంచి వచ్చేవారు. కానీ అధికారం కోల్పోవడం, కేసీఆర్ సైతం ఫాం హౌజ్‌కు వెళ్లడంతో నేతలు భవన్‌కు ముఖం చాటేశారు. కనీసం గ్రేటర్‌కు చెందిన నేతలు రాకపోవడం గమనార్హం. నేతలు లేక తెలంగాణ భవన్ బోసిపోయి కనిపిస్తోంది.
కనిపించని సందడి
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌కు ఉద్యమకాలం నుంచి పార్టీకేడర్, నేతలు, అభిమానులు నిత్యం వచ్చేవారు. వచ్చిపోయేవారితో భవన్ కళకళలాడేది. నిత్యం వందలాదిగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేవారు. పార్టీ అనుబంధ సంఘాల సమావేశాలు జరిగేవి. ప్రతి రోజూ పార్టీ కార్యాలయంలో ఏదో ఒక యాక్టీవిటీ ఉండేది. చివరకు పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా సమావేశం నిర్వహించి ఇచ్చేవారు. అయితే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది, అధికారం కోల్పోవడంతో బోసిపోతుంది. ఇదివరకు నిత్యం వచ్చే కార్యకర్తలు, నేతలు సైతం ముఖం చాటేస్తున్నారు. ఏదో అత్యవసర పరిస్థితి అయితేనే భవన్ లో కనబడుతున్నారు. లేకుంటే అటువైపు వచ్చేవారే కరువయ్యారు.
ఓటమితో అంతా రివర్స్
ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే చాలు టికెట్లు ఆశిస్తున్న నేతలతో భవన్ లో సందడి నెలకొనేది. ఉద్యమకారులు, పార్టీ లో సీనియర్ నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చివారు బయోడేటాలతో వచ్చేవారు. అంతేకాదు పార్టీ బీ ఫాం కోసం రోజుల తరబడి భవన్ చుట్టూ నేతలు ప్రదక్షిణలు చేసేవారు. ఫాం ఇస్తే గెలిచినట్లేననే ధీమా ఉండేది. అయితే అసెంబ్లీ ఒక్క ఓటమితో అంతా రివర్స్ అయింది. అసలు పార్టీ నేతలకు భవన్ కు రావడమే కరువైంది. టికెట్లు ఆశిస్తున్నవారు ఎప్పుడో ఒకరిద్దరుమాత్రమే వచ్చి ఆరా తీసి వెళ్తుండటం గమనార్హం. అధికారంలో నాడు ఉన్నప్పుడు ఎట్లుండో... ఇప్పుడు ఇలా ఉందనేది పార్టీ నేతల్లోనే చర్చనీయాంశమైంది.
మీడియా సమావేశాలకు దూరంగానే..
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, బీఆర్ఎస్‌పై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు పార్టీ మీడియా సమావేశం నిర్వహించాలని ఆదేశించినా ఇద్దరు ముగ్గురే వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్కరే వచ్చి మాట్లాడుతూ వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో అయితే పోటీపడి మీడియా సమావేశంలో నేతలు కూర్చునేవారు. కేసీఆర్ మీడియా సమావేశం ఎప్పుడు పెట్టమని చెబుతారా? అని ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి.. ఒక పార్టీ అధికారం కోల్పోతే ఏం జరుగుతుందనేది స్పష్టం చేస్తుంది. బీఆర్ఎస్ మూడునెలల్లోనే గడ్డుపరిస్థితి ఎదుర్కోవడం రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లోనూ చర్చకుదారితీసింది.