ఉండేదెవరు.. పోయేదెవరు?.. పార్టీ మారబోమంటూనే షాకిస్తున్న ‘గులాబీ’ నేతలు!

గులాబీకి సొంత పార్టీ నేతలే వరుస షాక్‌లు ఇస్తున్నారు. పార్టీ మారబోమంటూ ప్రకటనలు చేస్తూనే..మరోవైపు ఇతర పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు.

Update: 2024-03-15 02:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీకి సొంత పార్టీ నేతలే వరుస షాక్‌లు ఇస్తున్నారు. పార్టీ మారబోమంటూ ప్రకటనలు చేస్తూనే..మరోవైపు ఇతర పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు. కేసీఆర్ నిర్వహిస్తున్న పార్లమెంటు పరిధిలోని సమావేశాలకు గైర్హాజరు అవుతుండటం చర్చనీయాంశమైంది. పార్టీలో ఎవరుంటారో.. ఎవరుండరో తెలియక పార్టీ అధిష్టానం సతమతమవుతోంది.

బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో తెలియక పోవడంతో అధిష్టానానికే తలనొప్పిగా మారింది. పార్టీ నేతలను కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. ఒక్క అసెంబ్లీ ఓటమితోనే నేతలంతా కారు దిగుతుండటంతో పార్టీకి గడ్డుకాలం నెలకొంది. ఒకవైపు పార్టీ మారబోమంటూ ప్రకటనలు.. మరోవైపు ఇతర పార్టీలతో భేటీ నిర్వహిస్తున్న నేతల తీరు చర్చనీయాంశమైంది. అంతేకాదు పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయిన మరుసటి రోజే ప్రకటనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో తనయుడు భద్రారెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భేటీ అయ్యారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం వరంగల్ పార్లమెంటు ముఖ్య నేతల భేటీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీలో ఆయన చేరడానికే వెళ్లారని, వరంగల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంది. వీరేగాకుండా గ్రేటర్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని, ఇప్పటికే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలతో చర్చలు సైతం కంప్లీట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం.

రివ్యూలకు మాజీ ఎమ్మెల్యేలు దూరం

నల్లగొండ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో ఈ నెల 11న కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీకి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. గురువారం ఆదిలాబాద్ నేతలతో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో వారు పార్టీ మారుతారనే జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లయింది. వీరితో పాటు ఖైరతాబాద్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి ఇలా పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా పాల్గొనడం లేదనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం సైలెంట్ అయ్యారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

నిరుత్సాహంలో కేడర్

లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది నేతలు పార్టీని వీడటం గులాబీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్, పి.రాములు, మాజీ ఎంపీలు గోడెం నగేశ్, సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీలో చేరగా, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత హస్తం గూటికి చేరారు. ఇలా నేతలు ఒక్కొక్కరుగా చేజారడంతో గులాబీ శిబిరంలో ఆందోళన రేపుతోంది.

మల్లారెడ్డి తీరుపై కేసీఆర్ ఆరా

మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలోని నేతలతో పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీకి గల కారణాలు, ఆయన వ్యవహారం తీరును అడిగి తెలుసుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో మల్లారెడ్డి భేటీ అవుతారనే అంశంపై చర్చించినట్లు సమాచారం. రోజుకో విధంగా మాట్లాడుతుండటం, ఇదివరకే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి ఎంపీ స్థానాలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అంశాన్ని చర్చించినట్లు సమాచారం. ఒకటి రెండ్రోజుల్లో మిగిలిన పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News