కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం.. పార్టీ శ్రేణులకు టీపీసీసీ కీలక పిలుపు
యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ పై హత్యాయత్నం ఘటన నేపథ్యంలో హనుమకొండలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
దిశ, డైనమిక్ బ్యూరో: యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ పై హత్యాయత్నం ఘటన నేపథ్యంలో హనుమకొండలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడిని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు టీపీసీసీ పిలుపునిచ్చింది. నిరసనలో భాగంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించింది. అలాగే వరంగల్ కమిషనరేట్ వద్ద వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
ఈ దాడి వెనుక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో పాటు ఆయన అనుచరులు ఉన్నారని వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. కాగా సోమవారం సాయంత్రం వరంగల్ లో జరిగిన హాథ్ సే హాథ్ జోడోలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో కొంత మంది కాంగ్రెస్ నేత పవన్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న పవన్ ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే పవన్ పై దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.