మాధవీలత మసీదు వద్ద బాణం వేస్తున్నట్లు నటించడంపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ!
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి మాధవీలత మసీదుపై బాణం వేస్తున్నట్లు చేసిన చర్యలపై ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి మాధవీలత మసీదుపై బాణం వేస్తున్నట్లు చేసిన చర్యలపై ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ శాంతికి భంగం వాటిల్లుతుందని, హైదరాబాద్ ప్రజలు వీడియోలు చూస్తున్నారని, వారి కళ్లు మూయించలేరని, ఇలాంటివి ప్రజలు సహించరని అన్నారు. వారి సూచనలతో భవిష్యత్తులో తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలు వారి ఉద్దేశాలను గమణిస్తున్నారని, బీజేపీ- ఆర్ఎస్ఎస్ యొక్క రెచ్చగొట్టే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించరని అన్నారు.
ఈ చర్యలతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని, నరేంద్ర మోదీ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటే ఇదేనా? బీజేపీ పదే పదే చెప్పే వికసిత్ భారత్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తమకు ఎన్నికల కంటే హైదరాబాద్ శాంతి ముఖ్యమని, తెలంగాణ ప్రజలు రాష్ట్రం యొక్క శాంతికి ప్రతికూలంగా వ్యవహరించే బీజేపీకి వ్యతిరేఖంగా ఓటు వేస్తారని మాకు నమ్మకం ఉందని తెలిపారు. కాగా శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆమె.. మసీదు వద్దకు రాగానే బాణం తీసి వేస్తున్నట్లు గా నటించారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి రాజకీయంగా చర్చకు దారితీసింది.