Arogya Shri: ఆరోగ్యశ్రీ కార్డుల ఎంపిక ఎలా..? వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు షురూ

రోగ్యశ్రీ కార్డుల పంపిణీపై ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ కసరత్తు చేస్తున్నది.

Update: 2024-08-09 02:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ కసరత్తు చేస్తున్నది. ఆరోగ్య శ్రీ కార్డుల ఎంపికకు మార్గదర్శకాల తయారీ కోసం త్వరలోనే ఓ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీ మార్గదర్శకాలను తయారు చేయనున్నది. ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలి? పాత కార్డుల అప్‌డేట్, కొత్త పేర్లు ఎంట్రీ, సవరణలు వంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనున్నది. దీంతో పాటు రేషన్ కార్డుతో లింక్ కట్ చేస్తూ అందరికీ స్కీమ్ వర్తించేలా నిబంధనలు ఎలా ఉండాలి? అనే అంశాలపై ఈ కమిటీ స్పష్టమైన మార్గదర్శకాలను తయారు చేస్తుందని అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు కొత్త వ్యక్తులను గుర్తించేందుకు ఎలాంటి క్రైటేరియాను పొందుపరిచాలి? అనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వనున్నారు. ఆరోగ్యశాఖ తయారు చేసే నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నారు. సీఎం అప్రూవల్ తర్వాత ప్రక్రియ మొదలవుతుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

20 లక్షల మందికి ..?

ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకోకుండా బీపీఎల్(బిలో పవర్టీ లైన్) కుటుంబాలను ఇన్‌కమ్ సర్టిఫికేట్ ద్వారా గుర్తిస్తూనే, ఫీల్డ్ లెవల్ కమిటీ ద్వారా ఎంక్వయిరీలు చేయించనున్నారు. ఆయా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఏమిటీ? వంటి అంశాలపై కూడా సర్కార్ ఆరా తీయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల పై చిలుకు ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వెయిట్ చేస్తుండగా, మరో 11 లక్షల దరఖాస్తులు మెంబర్ అడిషన్(అదనపు సభ్యులు చేర్పులు) కోసం పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కార్డులు ఉన్నాళ్లకు అప్‌డేట్ చేస్తూనే, కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 54,45,658 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులుండగా, 35,50,496 స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు 89.96 లక్షల కుటుంబాలకు మళ్లీ కొత్త కార్డులు ఇస్తూనే, ఇప్పటి వరకు అసలు పొందని వాళ్లకీ ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయనున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 3 కోట్ల మందికి ఈ స్కీమ్ వర్తించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆరోగ్య శ్రీకి ప్రతి ఏటా దాదాపు రూ.1,100 కోట్లు ఖర్చు అవుతుండగా, కొత్త కార్డుల ద్వారా మరో నాలుగైదు వందల వరకు ఖర్చు పెరుగుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News