ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం.. ASI, CI పై దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

Update: 2024-10-13 05:44 GMT

దిశ, వెబ్‌డెస్క్/చిలుకూరు: దసరా ఉత్సవాలలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో డ్యూటీలో ఉన్న ఏఎస్సైపై ఏఆర్ కానిస్టేబుల్ దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామ కనకదుర్గమ్మ ఆలయ పరిధిలో మాజీ సర్పంచ్ భర్త వట్టికూటి నాగయ్య మూత్ర విసర్జన చేస్తుండగా.. అటుగా వెళుతున్న ఏఆర్ కానిస్టేబుల్ వరకుమార్ వెనక నుండి తన్ని ఫోటోలు తీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఆ ఘర్షణ కాస్తా గ్రామంలోని బీసీ, ఎస్సీ ఇరువర్గాల మధ్య రాళ్లు, పైపులతో దాడులు చేసుకునే వరకు దారి తీసింది. ఈ దాడిలో నాగయ్య వర్గీయుడికి తలపగిలి రక్తస్రావం కావడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో దైవదర్శనం కోసం బేతవోలు గుడికి వచ్చిన కోదాడ టౌన్ సీఐ రాము.. ఇరువర్గాలను చెదరగొట్టడానికి ప్రయత్నించగా అతడిపై కూడా కొందరు పైపులతో దాడి చేశారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న చిరుకూరు ఏఎస్ఐ‌ వెంకటేశ్వర్లుపై కూడా ఏఆర్ కానిస్టేబుల్ వరకుమార్ చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టి వర కుమార్ సహా పలువురిని స్టేషన్ కు తరలించారు. అనంతరం కోదాడ గ్రామీణ సీఐ రజితా రెడ్డి ఆధ్వర్యంలో చిలుకూరు, మునగాల ఎస్సైలు తమ బలగాలతో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం వట్టికూటి నాగయ్య ఇంటి దగ్గర శనివారం రాత్రి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ గుండెపంగు వరకుమార్, రెమిడాల వినోద్, తమలపాకుల నర్సింహారావు, నెమ్మాది ప్రభు, వంగూరి నవీన్, రెమిడాల బజార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News