పొలిటికల్ స్టంట్‌గా మహిళా వర్సిటీ.. MLC కవిత కోసమే వీసీ నియామకం జరిగిందా?
కోఠి ఉమెన్స్ కాలేజీని ఏడాది క్రితం మహిళా వర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: కోఠి ఉమెన్స్ కాలేజీని ఏడాది క్రితం మహిళా వర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022-23 అకాడమిక్ ఇయర్ నుంచే అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ప్రకటించినా అది అమలు కాలేదు. కానీ హడావుడిగా కోఠి మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ను మహిళా వర్సిటీ ఇన్‌చార్జి వీసీ బాధ్యతలు అప్పగించింది. దీని వెనుక ఏదో రాజకీయ కోణం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఎమ్మెల్సీ కవిత ఉమెన్ రిజర్వేషన్ల బిల్లు ఏర్పాటు కోసం ఈనెల 10న ఢిల్లీలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఏం చేసిందనే ప్రశ్నలు ఎదురయ్యే చాన్స్ ఉంది. దీంతో ముందుగానే జాగ్రత్త పడిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నపళంగా వర్సిటీకి ఇన్‌చార్జిని వీసీని నియమించినట్టు తెలుస్తున్నది.
ఏడాది తర్వాత వీసీ నియామకం
రాష్ట్రానికి ఓ మహిళా వర్సిటీ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గత ఏడాది కోఠి మహిళా కాలేజీని వర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం 2022-23 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారు? ఏ అకౌంట్‌కు బదిలీచేశారు? ఇంతకాలం వర్సిటీ పనులు ఎందుకు ప్రారంభం కాలేదు? అనే ప్రశ్నలకు ఉన్నతవిద్యా మండలి వద్ద కూడా సమాధానం లేదని టాక్. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.100 కోట్లు లెక్క తేలకపోగా.. తాజాగా 2023-24 బడ్జెట్‌లోనూ మహిళా వర్సిటీకి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. గతేడాది కోఠి మహిళా కాలేజీ పేరుతోనే అడ్మిషన్స్ జరిగాయి. మరి వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా మహిళా విశ్వవిద్యాలయం పేరుతో అడ్మిషన్లు ప్రారంభం అవుతాయా? అనే అనుమానాలు నెలకొన్నాయి. మరో మూడు నెలల్లో కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. ఈలోపు వర్సిటీ పరిధి ఏంటీ? ఏయే కాలేజీలు వర్సిటీ పరిధిలోకి వస్తాయి? వర్సిటీకి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్‌ను సమకూర్చుతారా? అనే చర్చ మొదలైంది.
‘వడ్డీ లేని రుణాల’ హడావుడి
గడచిన నాలుగేండ్లుగా ‘వడ్డీ లేని రుణాల’ గురించి పట్టించుకోని సర్కారు ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హడావుడి మొదలుపెట్టింది. ‘తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుక’ అంటూ రూ.750 కోట్ల మేర వడ్డీలేని రుణాలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల డ్వాక్రా మహిళా బృందాలకు రూ.500 కోట్లు, పట్టణ మహిళా బృందాలకు రూ.250 కోట్లు చొప్పున రిలీజ్ చేస్తున్నట్టు పేర్కొన్నది. చాలా కాలంగా మహిళా బృందాలు, విపక్ష పార్టీలు అటు వడ్డీలేని రుణాలతో పాటు పావలా వడ్డీ గురించి డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం ఒక దశలో హైకోర్టు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంత హడావుడి చేస్తున్న రాష్ట్ర సర్కారు ఒకవైపు మహిళా దినోత్సవానికి ఉద్యోగినులకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ఇచ్చింది.. ఇంకోవైపు పురపాలక శాఖ మహిళా వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది.. మరోవైపు వడ్డీలేని రుణాలకు ఆఘమేఘాల మీద నిధులను రిలీజ్ చేస్తున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా ప్రకటన ఇప్పించింది.