వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేక కూటమిదే విజయం: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కూటమిదే విజయం సొంతం అవుతుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Update: 2023-04-11 14:23 GMT

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి/ కొల్లాపూర్: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కూటమిదే విజయం సొంతం అవుతుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల లక్ష్య సాధన కోసం ప్రజలను సంఘటితం చేస్తామని అన్నారు. తనకు ఉద్యమాలు కొత్త ఏమి కాదని బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించాక ముందే కరెంట్ బిల్లుల రద్దు కోసం 15 రోజులపాటు ఉపవాస దీక్ష చేస్తూ జైల్లో గడిపానని, అనంతరం తన పోరాట పటిమను గుర్తించిన వైయస్సార్ 12 వందల కోట్లు విద్యుత్ బిల్లులను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా రాజీనామా చేసినట్లు గుర్తు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2 లక్షల ఎకరాల విస్తీర్ణం నుంచి 3 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెంచేందుకు ఎంతగానో కృషి చేసినట్లు గుర్తు చేశారు. దాని ఫలితంగానే వనపర్తి ప్రాంతానికి కూడా సాగునీటిని తరలించేందుకు అవకాశం లభించిందని, దాని ఫలితంగానే మంత్రి నిరంజన్ రెడ్డికి నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు వచ్చిందన్న విషయాన్ని మంత్రి గుర్తించుకోవాలన్నారు. గత ఎన్నికల్లో తన ఓటమికి ఎంతమంది పనిచేశారో తెలుసునన్నారు. పాలమూరు ప్రాజెక్టు పనులను ఆపాలని చెప్పిన వ్యక్తిని, తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులనే చేరదీసి అందలమెక్కించారని మండిపడ్డారు. బ్రిడ్జి నిర్మాణంలో ఐదు లక్షల పెండింగ్ బిల్లు కోసం ప్రభుత్వం రూ. 26 లక్షలు ఎలా చెల్లించారో చెప్పాలన్నారు.

ఇదే మాదిరి పెండింగ్ బిల్లులకు ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు చెల్లించాలని సూచించారు. మూడేళ్ల నుంచి పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుండా నేడు ప్రశ్నించిన కారణంగా పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఎన్నికల్లో 63 స్థానాలు, రెండవసారి 86 స్థానాలు గెలుపొందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురిచేసి లాక్కున్నారని మొత్తంగా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలన్నదే కేసీఆర్ కుట్రపన్నినట్లు ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ రాజ్యాంగంలో సూచించిన సూచనలను కేసీఆర్ తుంగలో తొక్కి ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే కరువు ఏర్పడిందని అధికారులు సైతం నివేదికలు పంపిన చలనం లేదని, కరెంట్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం జలాశయం ద్వారా నీటిని వినియోగిస్తున్నారని తద్వారా ఉమ్మడి పాలమూరు కరువు నేలగా మారుతుంది అన్నారు. రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేళ్లు గడుస్తున్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఎందుకు కట్టలేదని ప్రశ్నించడం తప్పా అని అన్నారు. తనను నమ్ముకున్న ముఖ్య కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వకపోవడం వల్ల ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేశారని అయినా ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచితమైన వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదని కేవలం పాలనాపరమైన అంశాలపైనే ప్రశ్నించానని తెలిపారు. మినిస్టర్ నిరంజన్ రెడ్డి బండారం వనపర్తి జిల్లా ప్రజలే బయట పెడతారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ పాలించే నైతిక హక్కు కోల్పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 స్థానాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కూటమి విజయ డంకా మోగిస్తుందన్నారు.

Also Read..

భద్రాచలం నియోజకవర్గ BRS ఇన్‌చార్జి మళ్లీ మార్పు

Tags:    

Similar News