Heavy Rain Alert: రాష్ట్రానికి మరో ముప్పు!.. మరో 5 రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

రాబోయే ఐదు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయని అంచనా వేశారు.

Update: 2024-09-04 07:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం సంభవించింది. పలుచోట్ల వరదలు ముంచెత్తడంతో సామాన్య జనం కకావికలం అయ్యారు. ఈ వరదల నుంచి ఇంకా కోలుకోకముందే తెలంగాణకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పలు జిల్లాల్లో హెవీ రెయిన్స్ పడతాయని భావిస్తున్నారు. ఇటీవల వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లోనే మరోసారి తీవ్ర ప్రభావం చూపనున్నాయనే హెచ్చరికతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..

ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేయగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మున్నేరు ముంచెత్తడంతో సర్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఖమ్మం ప్రజలను వరుణుడు మళ్లీ భయపెడుతున్నాడు. గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండటం, అతి భారీ వర్ష సూచనతో ముంపు కాలనీవాసులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. వరద తగ్గినా ఇంకా బురదలోనే పలు కాలనీలు చిక్కుకుని ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు కురిస్తే సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి..

పలు జిల్లాల్లో గత అర్ధరాత్రి నుంచే వర్షం దంచికొడుతున్నది. భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ లోయర్ మానేరు డ్యామ్ నిండడంతో దిగువకు నీటిని వదిలేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా కోహెడ పట్టణంలో వరద నీరు దుకాణాల్లోకి వచ్చి చేరింది. బస్వాపూర్ వద్ద బ్రిడ్జి పనులు చేస్తున్న 8 మంది కార్మికులు వరద నీటిలో చిక్కుకోవడంతో వారిని పోలీసులు కాపాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సంతో లక్ష వరకు చెట్లు నేలకొరిగాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వాగులు ఉప్పొంగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని మానోపాడు మండల పరిధిలోని అణరవాయి-మానవపాడు, గోకులపాడు-మానవపాడు మధ్యలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జల్లాపూర్ గ్రామంలో ఇళ్లుపై కప్పు కూలి పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వాన పడుతోంది.

నీటి పారుదల శాఖ హెచ్చరిక..

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నందున ఇరిగేషన్ శాఖ ప్రజలకు, వాహనదారులను హెచ్చరించింది. చెరువులు, మత్తల్లు, తూములు, పాకురుతో ఉంటాయని, ప్రమాదం పొంచి ఉన్నందున అటువైపు వెళ్లవద్దని ప్రజలకు సూచించింది. మత్తల్లగుండా నీటి ప్రవాహం ఉన్నప్పుడు కాలినడకన కానీ, వాహనాల్లో గానీ దాటవద్దని హెచ్చరించింది.


Similar News