బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మరో కొత్త ఫోబియా.. ఫోన్ వస్తే జంకుతున్న నేతలు
‘‘అన్న..నమస్తే..రేపు ఊర్ల ఓ పెండ్లి ఉన్నది.
‘‘అన్న..నమస్తే..రేపు ఊర్ల ఓ పెండ్లి ఉన్నది. దానికి అపోజిషన్ లీడర్ వస్తుండంట. ఆయన రూ.5 వేలు సాయం చేసేలా కనిపిస్తున్నది. మనం అంత కంటే ఎక్కువనే చేయాలె.. లేకపోతే ఇజ్జత్ పోతది’’ ఇదీ ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్ కాల్.
‘‘సార్ మొన్న జరిగిన చావుకు మీరు రాలేదు. అవతల పార్టీ లీడర్ వచ్చి రూ.10 వేలు ఇచ్చిండట. రేపు దినాలున్నయ్.. మీరు తప్పకుండా రావాలె. రూ.15 వేలు సాయం చేయాలె.’’ ఇదీ ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు.. కార్యకర్త నుంచి వచ్చిన ఫోన్ కాల్.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మొబైల్ ఫోబియా పట్టుకున్నది. ఫోన్ రింగ్ అయితే చాలు వారి గుండె గుబేల్ మంటున్నది. ఎత్తగానే ఏం అడుగుతారేమోననే భయం పట్టుకున్నది. కాల్ డిస్ కనెక్ట్ చేసినా, లిఫ్ట్ చేయకుండా మౌనంగా ఉన్నా ఏం అనుకుంటారేమోననే ఆందోళన నెలకొన్నది. అసలే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది.
ఈ క్రమంలో సమస్య చెబితే పరిష్కరించక పోయినా, పండుగలు, పబ్బాలు, చావులు, పెండ్లిళ్లు..ఇలా ఏ శుభకార్యానికి వెళ్లి ఆర్థిక సాయం చేయక పోయినా ఇబ్బంది వస్తున్నదని పలువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇలా రోజుకు రూ.లక్ష వరకూ సాయం రూపంలోనే ఇవ్వాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేయక పోతే ఆ కోపాన్ని ఓటర్లు రానున్న ఎలక్షన్‌లో ఎక్కడ చూపిస్తారనే భయం వారిలో పట్టుకున్నది.
దిశ,తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎక్కువగా తిరిగేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో తమ ఫోన్‌కు వచ్చిన ప్రతి కాల్‌నూ లిఫ్ట్ చేయాల్సి వస్తున్నది. అయితే ఫోన్ చేసిన వ్యక్తులు చెబుతున్న మాటలు విని ఏం చేయాలో తెలియక వారు ఇబ్బంది పడుతున్నారు. కొందరు పిల్లల పై చదువుల కోసం కాలేజీల్లో సీట్లు ఇప్పించాలని, ఇంకొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజు తగ్గించేలా చేయాలని ఫోన్లు చేస్తున్నారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. దీంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా రాలేదని, ఊళ్లో నీళ్లు రావడం లేదని, కరెంట్ కట్ చేస్తున్నారని, కళ్యాణలక్ష్మి చెక్కు రాలేదని ఫోన్లు చేస్తున్నారని వారు తెలుపుతున్నారు.
జాతర్లు, పండుగలకు చందాలు
రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో వేసవిలో గ్రామ దేవతల పండుగలు ఎక్కువగా జరుగుతుంటాయి. వాటికి లోకల్ ఎమ్మెల్యే నుంచి సాయం కోసం సొంత పార్టీ కేడర్ నుంచే ఫోన్లు వస్తున్నాయి. కొందరు తమ ఊళ్లో జాతర ఉన్నదని రూ.లక్ష ఇవ్వాలని కోరుతుండగా, మరో ఊళ్లో పెద్దమ్మ పండుగ పెట్టుకున్నామని, దానికి పార్టీ నుంచి రూ.2 లక్షలు ఇవ్వాలని సొంత పార్టీ కార్యకర్తలే డిమాండ్ చేస్తున్నట్టు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
దీంతో పాటు కార్యకర్తలు తమ ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలు, పండుగలు, ఇతర శుభకార్యాలకు రావాలని ఆహ్వానిస్తున్నారు. వెళ్తే ఉట్టి చేతులతో రావొద్దని తక్కువలో తక్కువగా రూ.10 వేలు కుటుంబ పెద్ద చేతులో పెట్టాలని కార్యకర్తలు సూచిస్తున్నట్టు ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
బయటికి వెళ్తే రోజుకు రూ.లక్ష ఖర్చు
గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు వినడంతో పాటు అప్పటికప్పుడు కొందరికి కొంత ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. పెళ్లిలు, పేరంటాలు, పండుగలు, చావులు..ఇలా ప్రతి దానికీ వెళ్లిన చోట ఆ కుటుంబ పరిస్థితులకనుగుణంగా కొంత ఆర్థిక సాయం చేయక తప్పట్లేదని అంటున్నారు. ‘ఇంటి నుంచి బయటికి వెళ్తే జోబులో కనీసం లక్ష పెట్టుకుని వెళ్తున్నాం. మళ్లీ ఇంటికొచ్చే సరికి మొత్తం ఖర్చు అయిపోతున్నాయి’ అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన ఆవేదనను వ్యక్తం చేశారు.
రానున్నది పండుగల కాలం
ఆగస్టు తర్వాత ఎప్పుడైన ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉన్నది. సరిగ్గా అప్పుడే రాష్ట్రంలో పండుగల సీజన్ మొదలవుతుంది. ముందుగా బోనాలు, ఆ తర్వాత గణేష్ ఉత్సవాలు, అవి ముగియగానే బొడ్రాయి, బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వరుసగా ఉంటాయి. ఈ టైంలో ప్రతి గ్రామానికీ ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముందుగానే మానసికంగా రెడీ అవుతున్నారు. అయితే ఈసారి దసరా మాత్రం చాలా స్పెషల్‌గా ఉంటుందని, సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఆ పండుగ వస్తుందని కార్యకర్తలు చెబుతున్నారు.
Read more: