మేడిగడ్డ బ్యారేజ్ ఎఫెక్ట్.. ప్రభుత్వానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరో లేఖ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌లో పిల్లర్ల కుంగుబాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవాళ మరో లేఖ రాసింది. ఘటనపై తాము కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ పేర్కొంది.
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌లో పిల్లర్ల కుంగుబాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవాళ మరో లేఖ రాసింది. ఘటనపై తాము కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని జాతీయ డ్యామ్ భద్రత అథారిటీ పేర్కొంది. రేపటిలోగా వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈనెల 23 నుంచి 26 వరకు కేంద్ర కమిటీ ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాచారం ఇచ్చిందని కేంద్రం తెలిపింది.
అయితే కమిటీ తిరుగుపయనానికి ముందే.. వారు అడిగిన మరికొన్ని వివరాలు ఇవ్వకపోవడంతో మరోసారి లేఖ రాశారు. మొత్తం 20 అంశాల సమాచారాన్ని కేంద్రం కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చిందని అధికారులు తెలిపారు. రేపటిలోగా అడిగిన సమాచారం ఇవ్వకుంటే.. ప్రాజెక్టు సంబంధించిన డాక్యుమెంట్లు లేనట్టుగా భావిస్తామని, ఆ మేరకు తదుపరి చర్యలు చేపడతామని కేంద్రం వెల్లడించింది.