తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ప్రజలకు మరింత దగ్గరగా..!

ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండడంతో దీనిని మరింత విస్తృతం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.

Update: 2023-12-23 02:00 GMT

సమస్యలు చెప్పుకుందామంటే వినే నాథుడే లేడని మొన్నటి వరకు బాధపడిన సగటు పౌరుడికి సాంత్వన చేకూర్చేలా కాంగ్రెస్​సర్కారు ప్రజాభవన్‌లో ప్రజావాణి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దీనికి విశేష స్పందన వస్తుండడంతో ప్రజల చెంతకే ‘ప్రజావాణి’ని తీసుకెళ్లేలా.. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంలో ఒక రోజు క్యాంప్​ ఆఫీసులో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నది. అయితే, ఇప్పటికే అన్ని కలెక్టరేట్లలో సాగుతున్న గ్రీవెన్స్‌కు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం కొనసాగనున్నది. దీంతో ప్రజల ప్రాబ్లమ్స్ తీర్చడంతో పాటు, ఎమ్మెల్యేలు–ప్రజల మధ్య సంబంధాలు మెరుగవుతాయని సర్కారు భావిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండడంతో దీనిని మరింత విస్తృతం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. కొత్త ఏడాదిలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో వారంలో ఒకసారి స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సెగ్మెంట్‌ వారిగా ప్రత్యేకంగా ఓ నోడల్ ఆఫీసర్‌ను నియమించే యోచనలో ఉన్నారు. దీంతో ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణితో సంబంధం లేకుండా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నట్టు టాక్ ఉంది.

ఎమ్మెల్యేలకు బాధ్యతలు

అసెంబ్లీ సెగ్మెంట్‌‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా లోకల్ ఎమ్మెల్యేలకు సమస్యలు తెలుసుకోవడం సులువు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతివారం నిర్వహించే ప్రోగ్రాంకు తప్పనిసరిగా ఎమ్మెల్యే హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునే విధంగా కార్యక్రమం రూపొందించాలని యోచిస్తున్నారు. అదే విధంగా ప్రజావాణి నిర్వహించే రోజున సెగ్మెంట్‌‌లో‌ని రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజాభవన్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రజావాణికి ఎక్కువగా ఆ మూడు శాఖలకు సంబంధించిన అప్లికేషన్లు వస్తున్నాయి. స్థానికంగా నిర్వహించే ప్రజావాణి ప్రోగ్రామ్‌కు ఆ డిపార్ట్‌మెంట్ అధికారులను పిలిస్తే సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రజల వెసులుబాటుకు వికేంద్రీకరణ

ప్రస్తుతం ప్రజావాణి ప్రోగ్రామ్ వారంలో రెండు రోజులు ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వ్యయప్రయాసలను ఓర్చుకుంటూ హైదరాబాద్‌కు వస్తున్నారు. కొందరు తెల్లవారుజామునే వచ్చి ప్రజాభవన్ పరిసరాల్లో నిరీక్షిస్తున్నారు. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం ప్రజావాణి ప్రోగ్రామ్‌ను అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌వారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నది. ఫలితంగా ప్రజల ఇబ్బందులు తీర్చడంతో పాటు, ఎమ్మెల్యేలు–ప్రజల మధ్య సంబంధాలు మెరుగవుతాయని భావిస్తున్నది.

ప్రత్యేక వెబ్ సైట్‌కు ప్లాన్

ప్రజావాణి కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ డిజైన్ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. వెబ్‌సైట్‌లో దరఖాస్తుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్ డేట్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రతి అప్లికేషన్లకు ఓ అక్నాలెడ్జ్‌మెంట్‌తో పాటు ఓ నంబర్‌ ఇవ్వనున్నారు. ఇచ్చిన నంబర్ ఎంటర్ చేస్తే దరఖాస్తు పురోగతి ఎక్కడుందో తెలుసుకునే విధంగా సైట్‌ను తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ అఫీసర్ల టీమ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News