నీలోఫర్‌లో మరో 800 పడకలు.. ఆసుపత్రుల విస్తరణలో వేగం పెంచిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో మరో 800 పడకలు అతి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో మరో 800 పడకలు అతి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నాయని, కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రోగుల సంఖ్య గతంతో పోల్చితే రెట్టింపు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు కొత్త వెంటిలేటర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం నీలోఫర్ హాస్పిటల్‌లో 200 వెంటిలేటర్లు ఉంటే.. పడకల సామర్థ్యం, రోగుల తాకిడికి అనుగుణంగా కేవలం 20 మాత్రమే వినియోగిస్తున్నారు. మిగతావి స్టాండ్బైలో ఉన్నాయని, నీలోఫర్ ఆసుపత్రి వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
ఈ ఎనిమిది వందల పడకలు అందుబాటులోకి రాగానే అన్ని వెంటిలేటర్లను వినియోగంలోకి తెస్తామని డాక్టర్లు తెలిపారు. ఇక ఆసుపత్రుల విస్తరణ వేగంగా జరగాలని మంత్రి హరీష్‌రావు ప్లాన్ క్రమంగా ముందుకు సాగుతున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతో 650 పడకలు, 4 టిమ్స్‌తో సుమారు 4500 పడకలు, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణ.. ఇలా మొత్తంగా సుమారు 10వేల సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులో తెచ్చేందుకు ఆరోగ్య మంత్రి ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇవి అందుబాటులోకి రాగానే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల కు వెళ్లే పేదలకు తప్పుతుందని ప్రభుత్వం భావన. దీంతోనే వీటి నిర్మాణాలను వేగంగా చేయాలని కసరత్తులు చేస్తున్నారు.
Also Read...