ఈడీ ఎదుట రేవంత్ రెడ్డి పేరు.. సంచలనంగా మారిన అంజన్ కుమార్ స్టేట్ మెంట్

నేషనల్ హెరాల్డ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో టీపీసీసీ రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది.

Update: 2022-11-23 09:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నేషనల్ హెరాల్డ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో టీపీసీసీ రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. ఈ కేసులో బుధవారం మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఢిల్లీలో ఈడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. యంగ్ ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ యాదవ్ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడిన అజన్ కుమార్ యాదవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలపై ఈడీ ప్రశ్నించిందని స్పష్టం చేశారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియాకు విరాళాలు ఇచ్చానని ఇదే విషయాన్ని ఈడీ అధికారులకు సైతం వెల్లడించానని అంజన్ కుమార్ చెప్పారు. సంస్థ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం వల్లే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చానన్నారు. మళ్లీ విచారణ ఉంటే పిలుస్తామని ఈడీ అధికారులు చెప్పారని, అయితే కక్ష సాధింపు చర్యలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేతలను విచారిస్తోందని అంజన్ కుమార్ ఆరోపించారు.

కాగా, ఈ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు మరి కొంత మంది టీ కాంగ్రెస్ నేతలను ఈడీ విచారించింది. తాజా విచారణలో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావడంతో టీపీసీసీకి నోటీసులు వెళ్తాయా అనేది ఆసక్తిగా మారింది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్న ఈడీ.. అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ఆధారంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విరాళాలు ఇచ్చేలా ప్రోత్సహించడం వెనుక రేవంత్ రెడ్డి ఆలోచనను ఈడీ ప్రశ్నించే ఛాన్స్ లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంజన్ కుమార్ యాదవ్ స్టేట్ మెంట్ రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకోబోతుందా? లేక ఇంతటితో ఆగిపోతుందా? అనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News