సచివాలయంలో మీడియాపై ఆంక్షలతో సర్కారుకే నష్టం

సచివాలయంలో మీడియాపై ఆంక్షలతో సర్కారుకే నష్టమని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్ అన్నారు.

Update: 2023-05-19 16:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రవేశంపై ఆంక్షలు తొలుత ప్రజలకు నష్టం కలిగించినా, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికే నష్టం కలిగిస్తాయని ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకుడు కే శ్రీనివాస్ అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రెండో సంవత్సరం పీజీ జర్నలిజం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిజం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సచివాలయంలో మీడియాని అనుమతించకపోవడంపై కొంత విమర్శలు వ్యక్తం అవుతున్నా, జరగాల్సిన స్థాయిలో చర్చ జరగడం లేదన్నారు. ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్‌ లో నిరసనలపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిషేధం విధించినా కొద్ది మందే స్పందించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియా అవసరం ఉంటుందని, అధికారంలోకి వచ్చాక దూరంగా ఉంచుతున్నారని విమర్శించారు.

ఏక మార్గంలో ప్రభుత్వం విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే పత్రికలు ప్రచురించాలని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని, మీడియా ప్రభుత్వం నుంచి సమాచారాన్ని రాబట్టుకోకుండా దారులు మూసేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి జర్నలిజం కోర్సులు, జర్నలిజం వృత్తి మధ్య పొంతన లేకుండా పోయిందని, కోర్సులను నవీకరించాల్సిన అవసరం ఉందన్నారు. విభిన్న ప్రసార మాధ్యమాలకు రాసే విధంగా నైపుణ్యాలను సంపాదించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వార్తా సేకరణ, రచన, ప్రజా సంబంధాలు, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ తదితర రంగాల్లో జర్నలిజం విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయి అన్నారు. ప్రస్తుతం డిజిటల్‌ మీడియా కీలకంగా మారిందని, అందులో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, మారుతున్న పరిస్థితులతో పాటు ఏం మారుతుందో తెలుసుకొని, దానికి తగ్గట్టుగా మన నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాక్షి చీఫ్‌ కార్టూనిస్టు శంకర్‌ వర్సిటీ జర్నలిజం శాఖ అధిపతి మారుపు వెంకటేశం, అధ్యాపకులు సుధీర్ కుమార్, రామాంజని కుమారి, హసీనా ప్రసంగించారు.

Tags:    

Similar News