ఇక డోర్ టు డోర్ సర్వీస్..! కార్గో సేవలపై టీజీఎస్ ఆర్టీసీ ఫోకస్

టీజీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. కార్గో పార్సిల్ సేవల ద్వారా వస్తువులను ఒకచోటు నుంచి మరోచోటుకు పంపిస్తున్న ఆ సంస్థ ఈ సేవలను మరింత బలోపేతం చేసేందుకు డెసిషన్ తీసుకుంది.

Update: 2024-07-30 03:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. కార్గో పార్సిల్ సేవల ద్వారా వస్తువులను ఒకచోటు నుంచి మరోచోటుకు పంపిస్తున్న ఆ సంస్థ ఈ సేవలను మరింత బలోపేతం చేసేందుకు డెసిషన్ తీసుకుంది. ప్రస్తుతం కార్గో, పార్సిల్‌ సేవలు ముఖ్యమైన బస్టాండ్ల వద్దే అందుబాటులో ఉన్నాయి. తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఆదాయ మార్గాలు, స్థితిగతులపై ఉన్నతాధికారులతో చర్చించారు. సంస్థ ఆదాయం పెంచుకునేందుకు కార్గో సేవలను విస్తరించాలని సూచించారు. కేవలం బస్టాండుల్లో మాత్రమే కాకుండా డోర్ టు డోర్ కార్గో సేవలు అందేలా లాజిస్టిక్‌ విభాగాన్ని అభివృద్ధి చేసుకోవాలని యాజమాన్యానికి సూచించారు. ఈ మేరకు ఇంటి వద్దనే బుకింగ్ చేసుకొని వచ్చిన పార్సిళ్లను తిరిగి ఇంటి వద్దకే చేరవేసేందుకు ఆర్టీసీ కసరత్తు ప్రారంభించాలని కోరారు. ఈ కొత్త కార్గో సేవల ప్రక్రియ మరో వారం, పది రోజుల్లో కొలిక్కి రానుందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

రిటైర్డ్ ఎంప్లాయిస్ భాగస్వామ్యం

ఈ కొత్త తరహా కార్గో సేవల్లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్ని భాగస్వామ్యం చేయాలని మంత్రి పొన్నం సూచించారు. అలా చేయటం వల్ల ప్రజలకు మెరుగైన సేవలతో పాటు వారికీ ఆదాయం కల్పించినట్లు అవుతుందని సూచించారు. అదే విధంగా ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న సగటు వార్షికాదాయం రూ.4,500 కోట్ల కాగా.. త్వరలోనే దాన్ని రూ.8,500 కోట్ల వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

1,000 వెయ్యి పాయింట్ల ద్వారా..

ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 90 పైచిలుకు బస్‌ డిపోలు, 40 వేల మందికిపైగా ఉద్యోగుల నెట్‌వర్క్‌ ఉన్నది. రాష్ట్రంలో కనీసం వెయ్యి పాయింట్లు ఏర్పాటు చేసి డోర్ టూ డోర్ కార్గో, పార్సిల్‌ సేవలు ప్రారంభించాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. తొలుత ప్రయోగాత్మకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రారంభించి ఆ తర్వాత మిగిలిన ప్రధాన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న కార్గో సేవల సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన జరుగుతోందని వివరించారు.

Tags:    

Similar News