అనంత రియల్ ఎస్టేట్​మాయ.. గాలకుంటను పూడ్చేసి విల్లాల నిర్మాణం

ప్రభుత్వ పరిధిలోని సిలీంగ్, ప్రభుత్వ, అసైన్డ్, దేవదాయ, ఇనామ్​ భూములతో పాటు కుంటలు, చెరువులను కాపాడుతామని అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ప్రజలకు ముచ్చట్లు చెప్పుతున్నాయి.

Update: 2024-08-27 11:15 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రభుత్వ పరిధిలోని సిలీంగ్, ప్రభుత్వ, అసైన్డ్, దేవదాయ, ఇనామ్​ భూములతో పాటు కుంటలు, చెరువులను కాపాడుతామని అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ప్రజలకు ముచ్చట్లు చెప్పుతున్నాయి. అంతేకాకుండా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ఊకదంపుడు హామీలు ఇస్తుంటారు. కానీ ప్రజలకు ఇచ్చిన మాటాలన్నీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మర్చిపోతారు. అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మొదటగా చెప్పే మాట ప్రభుత్వ స్థిరాస్థులను కాపాడాలని చెప్పడం, అధికారులు వినడం ఆలవాటుగానే మారిపోయింది. గత ప్రభుత్వంలో చేసిన తప్పులే పునరావృత్తం అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్తులైన భూములు, చెరువులు, కుంటలను కాపాడాలని తపనపడే వ్యక్తులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఆ అధికారులు, ప్రజాప్రతినిధులు ఫిర్యాదులను ఆసరాగా చేసుకోని వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విధానం తట్టిఖానా రెవెన్యూ పరిధిలోని గాల కుంట మాయమైయిందని స్థానికులు ఇరిగేషన్​అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. అంతేకాకుండా ఆ ఊరు ప్రజల అభిప్రాయాలకు విరుద్దంగా ఇరిగేషన్​అధికారి సమాధానం చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పట్టా భూములో ఉంటే పూడ్చేయోవచ్చా...!

రంగారెడ్డి జిల్లాలో భవిష్యత్తులో చూద్దామన్నా గ్రామాల్లో చెరువులు కనిపించని దుస్థితి రియల్​ వ్యాపారులు తీసుకోస్తున్నారు. సంపాదనే లక్ష్యంగా పనిచేసే అధికారులు, అదే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసే లేవుట్లు, వెంచర్లు, విల్లాల వ్యాపారులు ఎంతకైన తెగిస్తున్నారు. సహజసిద్ధమైన చెరువులను కబ్జాచేసే అధికారం పట్టా భూమి యాజమాన్యులకు కూడా లేదని రెవెన్యూ చట్టం తెలుపుతుంది. భూమిని నమ్ముకొని జీవనం సాగించే పట్టాదారుడైన రైతు చెరువును పూడ్చేందుకు జంకుతాడు. కానీ తమ అవసరాల నిమ్మిత్తం భూమిని విక్రయించిన తర్వాత కొనుగోలు చేసిన వ్యాపారి చెరువులను పూడ్చేందుకు సిద్ధపడుతున్నాడు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్​మెట్టు మండలం తట్టిఖానా గ్రామ రెవెన్యూ పరిధిలోని 38 సర్వే నెంబర్‌లో ఎకరంపైగా విస్తీర్ణంలో ఉన్న గాల కుంటను పూర్తిగా మాయం చేసి ఓ వ్యాపారి యథేచ్ఛగా విల్లాలను నిర్మిస్తున్నారు. 

ఇలా కుంటలను పూడ్చివేసే వ్యాపారులకు నిబంధనలు వర్తించవు. అంతేకాకుండా అధికారులు ఇచ్చే తప్పుడు పత్రాల ఆధారంగా ప్రశ్నించిన వ్యక్తులపై ఆ వ్యాపారులు ఎదురుప్రశ్నాలు వేయడం.., మీ వద్ద ఏమీ ఆధారులున్నాయని ఎదురుదాడి చేయడం అలవాటుగా మారిపోయింది. రైతుల వద్ద బహిరంగ మార్కెట్​ధరల కంటే తక్కువకు కుంట, చెరువు, గుట్టలని చెప్పి రియల్​వ్యాపారులు అతి తక్కువకు కొనుగోలు చేస్తారు. రియల్ వ్యాపారులు నిబంధనలకు విరుద్దంగా ఎన్ని తప్పులు చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు కనిపించవు. అదే రైతు చెరువును, కుంటలను పూడ్చివేస్తే ఫిర్యాదులు చేయడం, చిత్ర హింసలు పెట్టడం అధికారులకు అలవాటు. తట్టిఖానాలోని గాలకుంట చెరువును కబ్జా చేశారని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులే... ఇప్పుడు అదే కుంటను విల్లాలు నిర్మించే వ్యాపారికి ఎలాంటి చెరువులు, కుంటలు లేవని తప్పుడు పత్రాలను అధికారికంగా ఇవ్వడం సిగ్గు చేటు.

తట్టిఖానా గుట్ట నీళ్లుకు దారేది...?

చెరువులు, కుంటలు ఉండటంతో భవిష్యత్తులో భూములకు ధరలు ఉండవనే ఉద్దేశ్యంతో రైతులు విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయాలను ఆసరాగా చేసుకోని రియల్ ఎస్టేట్​వ్యాపారులు కొనుగోలు చేయడం ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల మద్దతుతో చెరువులను, కుంటలను పూడ్చివేయడం జరుగుతుంది. కానీ ఇదే ప్రజలు ఎంతో కాలంగా గ్రామానికి ఆదారమైన కుంటలను, చెరువులను నాశనం చేయడంతో భారీ వర్షాలు సంభంవించినప్పుడు ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ సమయంలో ప్రమాదాలను నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. అయినప్పటికీ అలాంటి ఆలోచనలు పట్టించుకోకుండా అందినకాడికి దోచుకోవడం... అడ్డగోలిగా ఎన్వోసీ పత్రాలు ఇవ్వడం అధికారులకే చెల్లుబాటు అవుతుంది.

తట్టిఖానా గ్రామ పరిధిలోని గాలకుంట ఆ ప్రజలకు ఒకప్పుడు జీవనాధారం. అంతేకాకుండా 38 సర్వే నెంబర్‌కు అతిచెరువలో ఉన్న 25, 24, సర్వే నెంబర్లల్లో ఎత్తైన కొండలు, గుట్టలు, రాళ్లు ఉన్నాయి. ఈ గుట్టపై పడిన నీళ్లు నిలిచే ఏకైక ప్రాంతం గాలకుంట. ఇప్పుడు ఆ గాలకుంటను పూర్తిగా పూడ్చివేసి ఓ వ్యాపారి విల్లాలు నిర్మిస్తున్నారు. దీంతో తట్టిఖానా గుట్టపై నుంచి వచ్చే వర్షపు నీరు నిలిచేందుకు స్థానం లేకుండా పోతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో వ్యాపారి నిర్మించే విల్లాలు భారీ వర్షాలకు మునిగిపోక తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ధరణిలో దర్శనమివ్వని గ్రామ నక్ష...

ప్రజలకు, రైతులకు భూవివరాలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వాలు గ్రామ రెవెన్యూ నక్షాలను ధరణిలో పొందుపర్చారు. భూ స్వరూపాన్ని తెలుసుకోవాలన్నా, ఏ ప్రదేశంలో ఏ సర్వే నెంబర్​ కలిగి ఉన్నది.. ఏ ప్రదేశంలో చెరువులు, కుంటలున్నాయి.. ఏ ప్రదేశంలో గుట్టలు, వాగులు, అటవీ ప్రాంతం ఉందనేందుకు రెవెన్యూ నక్షాలు ప్రధానం. అలాంటి నక్షాలను ధరణి వెబ్‌సైట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చారు. అయితే ఆ నక్షాలు ధరణిలో దర్శనమివ్వకపోవడంపై పలు అనుమానాలకు తావునిస్తుంది. అధికారులు చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ధరణిలో నక్షా కనిపించకుండా సంబంధిత అధికారులు టెక్నికల్​సమస్యను సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.


Similar News