ఆదర్శంగా ఫేర్‌వెల్ పార్టీ! (వీడియో)
పాఠశాలలో ఫేర్ వేల్ పార్టీ అనగానే డీజే పాటలు డాన్సులు విందు భోజనం అని అందరికీ తెలుసు.
దిశ, గన్నేరువరం: పాఠశాలలో ఫేర్ వేల్ పార్టీ అనగానే డీజే పాటలు డాన్సులు విందు భోజనం అని అందరికీ తెలుసు. దీనికి భిన్నంగా ఆలోచించి ఓ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కట్టా రవీంద్ర చారి, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో పదవ తరగతి పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్న విద్యార్థులకు మాతృ వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
పాఠశాల విద్యార్థులు వారి తల్లులను వేదికపై కుర్చీలలో కూర్చోబెట్టి వారి కాళ్లను తాంబులంలో ఉంచి భక్తిశ్రద్ధలతో కడిగి పూలతో పూజిస్తారు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ తల్లులు ఆశీర్వదిస్తారు. ఈ దృశ్యం పాఠశాలలో అమ్మ యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియపరచడానికి ఎంతగానో తోడ్పడుతున్నది. నేటి సమాజంలో తల్లులను చిన్నచూపు చూస్తున్న పిల్లలు ఈ మాతృ వందనం కార్యక్రమం తో కనువిప్పు కలిగిస్తుంది. ఈ విధమైన వినూత్న కార్యక్రమంతో విద్యార్థులలో తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలియజేస్తున్న అధ్యాపక బృందాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
విద్యార్థులకు తల్లి గొప్పతనం తెలియజేయడానికి......
కట్టా రవీంద్ర చారి (ప్రధానోపాధ్యాయుడు)
విద్యార్థులకు క్రమశిక్షణలో భాగంగా తల్లి గొప్పతనం తెలియజేయడానికి ఈ కార్యక్రమం గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్నాము. అమ్మను మించిన దైవం లేదని ఆమె దీవెనలతో విద్యార్థులు పరీక్షలను ఉత్తమ ఫలితాలను పొందుతున్నారు. అమ్మను పూజిస్తే సాక్షాత్తు సకల దేవతలను పూజించినట్టే.