Bandi Sanjay పాదయాత్ర పొడిగింపు.. కారణం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మరో రోజుకు పొడిగించారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మరో రోజుకు పొడిగించారు. ఆగస్టు 26న మూడో విడత పాదయాత్ర ముగుస్తుందని తొలుత ప్రకటించినా మరో రోజు పొడిగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆగస్టు 27న మూడో విడత పాదయాత్ర ముగియనుంది. ఆగస్టు 2వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభమైన మూడో విడత పాదయాత్రను కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ పార్టీ జెండాను ఊపి ప్రారంభించారు. యాదాద్రి నుంచి జనగామ మీదుగా ఈ యాత్ర వరంగల్ చేరుకుంటుంది. వరంగల్‌లోని భద్రకాళిని దర్శించుకోవంతో ఆగస్ట్ 26వ తేదీన యాత్రను ముగిస్తారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా వస్తారని తొలుత ప్రచారం జరిగినా ఆయన ఈ నెల 21న మునుగోడు నియోజకవర్గంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యలో జేపీ నడ్డా హాజరు అవుతారని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 26న జేపీ నడ్డాకు ఇతర కార్యక్రమాలు ఉండటం వల్ల పాదయాత్ర ముగింపును 27 వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఈ సభలో టీఆర్ఎస్ మాజీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు మరి కొంతమంది ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు.