Amara Raja : తెలంగాణ నుంచి అమరరాజా వేరే చోటికి వెళ్లిపోవచ్చు ..! గల్లా జయదేవ్ షాకింగ్ కామెంట్స్
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో అమరరాజా బ్యాటరీ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్ : గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో అమరరాజా బ్యాటరీ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్లాంట్ విషయంపై గల్లా జయదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత బిఆర్‌ఎస్ హయాంలో బ్యాటరీ ప్లాంట్‌కోసం ఇచ్చిన హామీలను ఇప్పుడున్న ప్రభుత్వం నెరవేర్చకపోతే తమ ప్లాంట్ కోసం వేరే చోట వెతకాల్సి ఉంటుందని అమరరాజా కంపెనీ చైర్మన్ జయదేవ్ గల్లా శనివారం అన్నారు. ఈ రోజు 1.5 GWh బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ యొక్క ఫేజ్1 శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా గల్లా జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా.. అమరరాజా తెలంగాణలో లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ,గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 10 ఏళ్లలో 9,500 కోట్ల పెట్టుబడి కోసం గత BRS ప్రభుత్వంతో MOU లు చేసుకుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో కొన్ని హామీలను ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నెరవేరుస్తారనే ఆశతో ఉన్నామని గల్లా తెలిపారు.ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ హామీలను విస్మరిస్తే అమర రాజా ప్లాంట్ వేరే చోటుకి వెళ్లే అవకాశముందని గల్లా జయదేవ్ తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన బృందం అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో గల్లా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.