ఖమ్మంలో బీఆర్ఎస్‌కు మరో షాక్.. తుమ్మలతో పాటు హస్తం గూటికి కీలక నేతలు

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం

Update: 2023-09-03 10:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు హైదరాబాద్‌లో తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. శనివారం తుమ్మలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని, కలిసి పనిచేద్దామని సూచించారు. అనంతరం ఆదివారం తుమ్మలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా కలిశారు. కాంగ్రెస్ నేతల వరుస చర్చలతో తుమ్మల హస్తం గూటికి చేరడం లాంఛనంగా మారింది.

ఈ నెల 6న కాంగ్రెస్‌ గూటికి తుమ్మల!

ఈ నెల 6వ తేదీన తుమ్మల ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో  కండువా కప్పుకుంటారని సమాచారం. 7వ తేదీ నుంచి రాహుల్ యూరప్ పర్యటనకు వెళుతున్నారు. దీంతో 6వ తేదీన రాహుల్ గాంధీని తుమ్మల కలిసి పార్టీలో చేరనున్నారు. తుమ్మలతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీ బయల్దేరనున్నారు. అయితే తుమ్మలతో పాటు ఆయన ముఖ్య అనచరులు కూడా హస్తంకే జై కొట్టనున్నారు. వీరితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు చెందిన పలువురు కీలక నేతలు కూడా తుమ్మలతో పాటు కాంగ్రెస్ గూటికి చేరేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ డౌన్

బీఆర్ఎస్‌లోని పలువురు అసంతృప్తి నేతలు తుమ్మలతో చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్‌లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని పలువురు నేతలు ఆవేదనతో ఉన్నారు. అలాంటివారు తుమ్మలతో పాటు అసంతృప్తి హస్తం గూటికి చేరేందుకు సిద్దమవుతున్నారు. వారంతా తుమ్మలతో పాటు 6వ తేదీన కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వీక్ అయింది. తుమ్మలతో పాటు మరికొంతమంది నేతలు పార్టీ మారనుండటం బీఆర్ఎస్‌కు పెద్ద షాకే అని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తానంటూ ఆయన శపథం చేశారు. అందుకు తగ్గట్లు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు.

తుమ్మల చేరిక కాంగ్రెస్‌కు ఎంతవరకు లాభం..?

ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో లక్షలాది మంది కార్యకర్తల నడుమ పొంగులేటి కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల కూడా కాంగ్రెస్‌ గూటికి వెళుతుండటంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మరింత బలహీనపడుతుంది. ఖమ్మం పాలిటిక్స్‌లో పొంగులేటి, తుమ్మల బలమైన నేతలుగా ఉన్నారు. రాజకీయాల్లో ఎప్పటినుంచో వీరిద్దరు కొనసాగుతుండగా.. ఇరువురికి జిల్లావ్యాప్తంగా బలం ఉంది. వీరి చేరిక కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News