T- కాంగ్రెస్‌లో శుభాపరిణామం.. ఎన్నికల వేళ ఆ నేతలంతా ఒక్కటయ్యారు..!

గ్రూపులు, వర్గాలకు కేరాఫ్‌గా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాలు మార్పు తీసుకొచ్చాయి.

Update: 2023-06-19 03:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూపులు, వర్గాలకు కేరాఫ్‌గా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాలు మార్పు తీసుకొచ్చాయి. ప్రస్తుతం విభేదాలు వీడి ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. ఐక్యంగా ఉండి కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించామని డీకే శివకుమార్, సిద్ధరామయ్య చెప్పడంతో ఇక్కడి నేతలు అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు.

ఇంతకాలం రేవంత్, ఉత్తమ్, భట్టి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలాంటి అనేక గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. ప్రస్తుతం గ్రూపుల మధ్య ఘర్షణలు, వర్గపోరు తాత్కాలికంగా వెనకపట్టు పట్టింది. ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే అధ్యక్షతన నిత్యం పార్టీ సమావేశాలు జరుగుతుండడంతో విభేదాలున్నప్పటికీ నేతలంతా గాంధీభవన్ బాట పడుతున్నారు.

విభేదాలు పక్కన పెట్టి

కర్ణాటక ఫార్ములానే తెలంగాణలోనూ అనుసరిస్తామని రాష్ట్ర నేతలు చెప్పడంతో పాటు అదే సక్సెస్ మంత్రంగా పకడ్బందీగా అమలు కావాలని ఆ రాష్ట్రంలో యాక్టవిగా వ్యవహరించిన డీకే శివకుమార్ సూచించారు. ఆయన సలహాలు, సూచనలతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ప్రియాంకాగాంధీ సైతం ఇకపైన తెలంగాణ వ్యవహారాల్లో చొరవ తీసుకుంటానని చెప్పడంతో పాటు అసంతృప్తిని పక్కన పెట్టి పార్టీని పవర్‌లోకి తీసుకురావడానికి ఐక్యంగా పనిచేయాలన్న మాటలు వర్కవుట్ అవుతున్నాయి. విభేదాలను పక్కన పెట్టి సొంత నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలకు హాజరవుతున్నారు.

అందరిదీ అదే లక్ష్యం

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహ రచనలో తలమునకలయ్యారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రెండు నెలలుగా రాష్ట్రమంతటా పాదయాత్రలో బిజీగా ఉన్నారు. ఇంకొన్ని వారాల పాటు ఇది కంటిన్యూ కానున్నది. ప్రియాంకా గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన మీటింగుకు హాజరయ్యారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జగ్గారెడ్డి కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ లైన్‌కు భిన్నమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పదమయ్యారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిపైనా చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం లేపాయి. కర్ణాటక రిజల్టు తర్వాత ఆయన వైఖరిలోనూ మార్పు వచ్చింది. ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు. ఇటీవల బీజేపీలో చేరిన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిని సైతం తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొస్తానంటూ మీడియాతో వ్యాఖ్యానించారు.

గాంధీభవన్ గడప తొక్కనంటూ కామెంట్ చేయడమే కాక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపైనా విమర్శలు చేశారు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఆగిపోయాయి. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఖరిలోనూ మార్పు వచ్చిందని గాంధీభవన్ వర్గాలే గుర్తించాయి. బీఆర్ఎస్‌ను అధికారంలోకి రాకుండా చేయడం, పదేళ్ల విరామం తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీని పవర్‌లోకి తేవడంపైనే నేతలు వారివారి స్థాయిలో ఫోకస్ పెట్టారు.

అగ్రనేతల రాకతో మార్పు

ఒకే పార్టీలో పరస్పరం శత్రువులుగా ఉండే నేతలను ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే ఒకటి చేస్తున్నారు. దీనికి తోడు ప్రియాంకాగాంధీ తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉంటారనే మెసేజ్ వెళ్ళడంతో నేతల్లో ఒకింత జంకు నెలకొన్నది. దీంతో గ్రూపులు, వర్గాలు, విమర్శలు లాంటివాటిని పక్కకు పెట్టక తప్పలేదు. రాహుల్‌గాంధీ చేపట్టిన జోడో యాత్ర టైమ్‌కే కొద్దిమంది వారి వైఖరిని మార్చుకున్నారు. తాజాగా కర్ణాటక ఫలితాల తర్వాత మరికొందరిలో మార్పు అనివార్యమైంది.

Read More:   ముంపు భూముల్లో పార్కు నిర్మాణం.. ఫిర్యాదులు వెళ్లినా ఆఫీసర్స్ సైలెంట్

Tags:    

Similar News

టైగర్స్ @ 42..