హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. నీటి సమస్యకు టోల్ ఫ్రీ నెంబర్ ఇదే
హైదరాబాద్ నగరంలో నీటి సంక్షోభం తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో:బెంగళూరు వంటి నగరాల్లో తాగునీటి సంక్షోభం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అలాంటి పరిస్థితులు హైదరాబాద్ నగరంలో తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ రింగ్ రోడ్ పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడిన 155313 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ నెంబర్ ను సంప్రదించాలని హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నగర ప్రజలకు సూచించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని డ్రా చేస్తున్నామని చెప్పారు. గతంలో హైదరాబాద్ నీటి అవసరాలకు 2300 ఎంఎల్డీ సరఫరా చేసేవారని ఇప్పుడు 2450 ఎంఎల్డీ నీరు సరఫరా చేస్తున్నామన్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగుర్ లో నీటి నిలువలు ఉన్నాయని వాటి ద్వారా ప్రజలకు నీరు అందిస్తామన్నారు.
ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు:
వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి మిగతా అవసరాలకు నీటి సమస్య ఉన్న మాట వాస్తవమే అని మంత్రి పొన్నం అన్నారు. ఈ సమస్యను ఉపయోగించుకుని ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి సమస్యపై ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పలుప్రాంతాల్లో నీటి సరఫరా ఇబ్బందులు తన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి ఇదివరకే సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించించిన సంగతి తెలిసిందే.