ALERT : మూడు రోజులు వర్షాలు..! ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దిశ ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది . నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మిగతా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నేడు ,రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు . ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలెర్ట్ హెచ్చరికలను వాతావరణ శాఖా అధికారులు జారీ చేసింది.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు . రైతులు, కూలీలు చెట్ల కింద ఉండకూడదని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడించారు. వానలు పడే సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు