Telangana Assembly : విద్యుత్ బకాయిలపై అక్బరుద్దీన్ అసహనం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) బుధవారం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (MLA Akbaruddin Owaisi) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) బుధవారం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (MLA Akbaruddin Owaisi) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు(Electricity Dues) ఎందుకు చెల్లించట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను కాంగ్రెస్ కొనసాగిస్తోందని విమర్శించారు. పాతబస్తీ(Old City)కి సంబంధించి నష్టాలు వస్తున్నట్లు పదేపదే చెబుతున్నారు కాని, విద్యుత్ కొనుగోళ్ల ధరలపై ఎవరూ ప్రశ్నించట్లేదు ఎందుకని నిలదీశారు. గతంలో కంటే విద్యుత్ ధరలను పెంచి కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయని, ఇది మాత్రం ఎవరికీ ఎందుకు కనిపించడం లేదని ఆరోపించారు.
ఇబ్రహీంబాగ్‌లో హైటెన్షన్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఐదెకరాలు కావాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని తెలిపారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉందని, ఎవరు నేరస్థులు, ఎవరు కాదనేది పోలీసులకు పూర్తిగా తెలుసని.. కాని భూవివాదాల పరిష్కారంలోనే పోలీస్‌స్టేషన్లు తలమునకలయ్యాయని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీస్‌స్టేషన్లు భూవివాదాల పరిష్కారంలో ఉండడం వల్లే నేరాలు పెరుగుతున్నాయని, ఇకనైనా పోలీసులు ఆ పంచాయితీలు పక్కన పెట్టి శాంతిభద్రతల పరిరక్షణ చేపట్టేలా చూడాలని అక్బరుద్దీన్ కోరారు.