సెప్టెంబర్ నుంచి ఏయిర్ పోర్టు మెట్రో పనులు.. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

వచ్చే సెప్టెంబర్ నుంచి ఏయిర్ పోర్ట్ మెట్రోరైలు పనులను ప్రారంభించి, మూడేళ్లలో పనులను పూర్తి చేసి మెట్రోరైలును అందుబాటులోకి తేనున్నట్లు ఏయిర్ పోర్ట్ మెట్రో రైలు ఎండీ డా. ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

Update: 2023-06-14 16:18 GMT

దిశ, సిటీ బ్యూరో: వచ్చే సెప్టెంబర్ నుంచి ఏయిర్ పోర్ట్ మెట్రోరైలు పనులను ప్రారంభించి, మూడేళ్లలో పనులను పూర్తి చేసి మెట్రోరైలును అందుబాటులోకి తేనున్నట్లు ఏయిర్ పోర్ట్ మెట్రో రైలు ఎండీ డా. ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. శంషాబాద్ ఏయిర్ పోర్టు మెట్రో రైలు ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ (ఈపీసీ) పనులకు సంబంధించిన గ్లోబర్ బిడ్లకు సంబంధించిన బుధవారం ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఏయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక పనులైన సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్ మెంట్ ఖరారు వంటి పనులు పూర్తయ్యాయని, భూసార పరీక్షలు కూడా వేగవంతమయ్యాయని, త్వరలోనే అవి కూడా పూర్తి చేస్తామంటూ ఏయిర్ పోర్టు మెట్రో రైలు ప్రాజెక్టు ప్రయోజనాలను సమావేశంలో పాల్గోన్న 13 జాతీయ బిడ్ల కంపెనీలకు వివరించారు. 31 కిలోమీటర్ల పొడువున నిర్మించనున్న ఏయిర్ పోర్ట్ మెట్రో రైలును 29.3 కి.మీ.ల పొడువున ఎలివేటెడ్ కారిడార్ గా 1.7 కి.మీ.ల పొడువున సొరంగ మార్గం ద్వారా కారిడార్‌ను నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మొత్తం 9 స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రాజెక్టు వ్యయం రూ. 6250 కోట్లు కాగా, హెచ్ఎండీఏ, జీఎంఆర్ సంస్థలు ఒక్కోక్కరు పదిశాతం నిధులను సమకూర్చుతుండగా, మిగిలిన నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనున్నట్లు రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాతీయ నిర్మాణ సంస్థలైన ఎల్ అండ్ టీ, అల్ స్టామ్, సీమన్స్, టాటా ప్రాజెక్టులు, ఇర్కాన్, ఆర్ వీఎన్ ఎల్, బీఈఎంఎల్, ప్యాండ్రోల్ రహీ టెక్నాలజీస్ లతో కలిపి మొత్తం 13 ఇంటర్నేషనల్ సంస్థలు పాల్గొన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ ఇంజనీరింగ్ సలహాదారు సుభోద్ జైన్, చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ డీవీఎస్ రాజు, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి. ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్ ఎం. విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ ఈ వై. సయప రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (రైల్వే) జె.ఎన్. గుప్తాతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక నిపుణలు, జనరల్ కన్సల్టెంట్లు హాజరయ్యారు.


Similar News