భూదాన్ భూములు అన్యాక్రాంతం.. ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోదండరెడ్డి
రాష్ట్రంలో భూదాన్ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూదాన్ భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అనేక అరాచకాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. భూదాన్ భూములు అన్యాక్రాంతం అవుతున్నా.. సర్కార్కు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భూదాన్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడితే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక భూదాన్ బోర్డ్ రద్దు చేశారన్నారు. ప్రభుత్వమే భూదాన్ భూములు అమ్ముకుంటుందన్నారు.
భూదాన్ బోర్డ్ రద్దుతో భూములకు రక్షణ కరవైందన్నారు. అంబానీ , అదానీలకు మోడీ ప్రభుత్వం సొమ్ములను కట్టపెడుతున్నట్లే.. కేసీఆర్ కూడా కార్పొరేట్ వ్యక్తులను పెంచి పోషిస్తున్నారన్నారు. ఇక బండి సంజయ్, బీజేపీ నేతలు చెప్పే మాటలకు విలువ లేదన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతిపై ఆరోపణలు చేస్తూ కాలం ఎల్లదీస్తున్నారన్నారు. నిజంగా కేసీఆర్ అవినీతికి పాల్పడితే కేంద్రంలో అధికారంలో ఉండి కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. కేంద్రం ఐటీఐఆర్ ఇవ్వలేదని కేటీఆర్ ఇప్పుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పగటి వేశగాళ్లలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.