సీన్‌లోకి రేవంత్ బృందం.. టీ-కాంగ్రెస్‌లో ప్రక్షాళన షురూ!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకు ఏఐసీసీ రెడీ అవుతున్నది. ఇందులో కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాలుగు రోజులోగా ఢిల్లీలోనే ఉంటున్నారు.

Update: 2022-11-26 03:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకు ఏఐసీసీ రెడీ అవుతున్నది. ఇందులో కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాలుగు రోజులోగా ఢిల్లీలోనే ఉంటున్నారు. పార్టీలో మార్పులు, చేర్పుల జాబితాపై కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్‌తో చర్చలు జరుపుతున్నారు. కొన్ని మార్పులపై రేవంత్ పట్టుపడుతున్నట్టు సమాచారం. సుమారు సగం మంది జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశాలున్నాయి. ముగ్గురు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పైనా వేటు వేయబోతున్నట్టు తెలుస్తున్నది. వచ్చె నెలలో మొదటివారంలోగా అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఉప ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ ఓటమిని చవిచూస్తుండటంతో పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. సీనియర్ నేతలు వివాదాల్లోకి ఎక్కుతున్నారు. మాజీ మంత్రి శశిధర్​రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సమయంలో టీపీసీసీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయినా టీపీసీసీ నుంచి ఏ ఒక్కరూ స్పందించలేదు.

మార్పుపై టీపీసీ ఛీప్ ఫోకస్

పార్టీపై ఆరోపణలు వచ్చిన సమయంలో వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు తన వర్గం వారు ఉండాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షుల మార్పునకు ఏఐసీసీ ఆమోదం చెప్పినట్టు సమాచారం. ఈ విషయంపైనే చర్చలు జరిపేందుకు నాలుగు రోజులుగా రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో చర్చిస్తున్నారు. దాదాపుగా 16 నుంచి 20 జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశాలున్నట్లు సమాచారం. వీరికి టీపీసీసీలో ఏదైనా ఒక పోస్టును ఇవ్వాలని భావిస్తున్నారు. వాస్తవానికి మొదటి నుంచి రేవంత్ తన టీం గురించి ప్లాన్ వేశారు. పదవులు పంపకాలు అప్పుడే మొదలుపెడితే గ్రూపులు పెరిగిపోతాయని భావించారు. ఇక కొంత మంది జిల్లా అధ్యక్షులకు ఇన్ డైరెక్ట్‌గా సంకేతాలు సైతం ఇస్తున్నారు. ప్రస్తుతం టీపీసీసీలో ఐదుగురు వర్కింగ్​ప్రెసిడెంట్లు ఉన్నా.. ఉపయోగం లేకుండా పోయింది. ఇటీవల జోడో యాత్రలోనూ వర్కింగ్​ ప్రెసిడెంట్లు ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ముగ్గురిపై వేటు వేయాలని రేవంత్‌రెడ్డి.. ఏఐసీసీ నేతల వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్టు గాంధీభవన్​వర్గాల్లో చర్చ జరుగుతున్నది. గీతారెడ్డి, అంజన్‌కుమార్​యాదవ్‌, మహ్మద్​అజారుద్దీన్‌ను పక్కన పెట్టాలని రేవంత్ ఒత్తిడి తెస్తున్నారు. దీనికి ఏఐసీసీ నుంచి కూడా ఆమోదం వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చేనెల మొదటివారంలోనే ఏఐసీసీ చీఫ్​ఖర్గే ద్వారా ఈ జాబితాను విడుదల కానున్నట్టు సమాచారం.

అనుబంధ కమిటీలు..

టీపీసీసీకి కొత్త కమిటీతో పాటుగా అనుబంధంగా పలు కమిటీలు వేయనున్నట్టు టాక్. ఈ మేరకు డిసెంబర్​4న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​మాణిక్కం ఠాగూర్‌తో పాటుగా ఏఐసీసీ చీఫ్​ ఖర్గేతో రేవంత్ భేటీ కానున్నట్టు తెలుస్తున్నది. పొలిటికల్​ఎఫైర్స్​కమిటీ, కో ఆర్డినేషన్​ కమిటీతో పాటుగా ప్రచార కమిటీని సైతం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీ కొనసాగుతున్నారు. టీపీసీసీ పొలిటికల్​ఎఫైర్స్​కమిటీలో 12 మందికి అవకాశం ఇవ్వనున్నారు. ఖర్గేతో సమావేశం అనంతరం పూర్తిస్థాయిలో కమిటీలను ప్రకటించే చాన్స్ ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పు నేపథ్యంలో ఈ కమిటీల్లో వారిని సర్దుబాటు చేయనున్నారు.

Tags:    

Similar News