'పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది'

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అగ్రికల్చర్‌ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంతు గిండెగీ అన్నారు.

Update: 2023-08-31 14:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అగ్రికల్చర్‌ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంతు గిండెగీ అన్నారు. గురువారం నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన 14వ గ్రాండ్‌ నర్సరీ మేళా ను అగ్రోస్‌ ఎండీ, అగ్రికల్చర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కే రాములుతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని కోరారు. ప్రభుత్వం హరితహారం చేపట్టడం ద్వారా రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రభుత్వం అడవులను పునరుజ్జీవం చేసిందనీ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అనేక రకాల మొక్కలు ఒకే చోట లభించే విధంగా ఆల్‌ ఇండియా హార్టీకల్చర్‌ పేరుతో గ్రాండ్ నర్సరీ మేళాను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను ఆయన అభినందించారు.

ఆగ్రోస్‌ ఎండీ రాములు మాట్లాడుతూ.. నగరాలు కాంక్రీట్‌ జంగిల్‌లా పెరుగుతున్న నేపథ్యంలో చిన్న పాటీ గార్డెన్‌ ఏర్పాటు చేసుకుంటే రిలీఫ్‌ ఉంటుందన్నారు. పచ్చదనం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చక్కటి ఆరోగ్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందేందుకు తోడ్పాటును అందిస్తాయన్నారు. ప్రజల ఇష్టాలకు అనుగుణంగా కిచెన్‌ గార్డెన్‌, వర్టికల్‌ గార్డెన్‌, టెర్రస్‌ గార్డెన్‌ను హ్యాబీగా చేసుకుంటే ఆక్సీజన్‌తో పాటు వర్క్‌ ప్రెజర్‌ తగ్గి మానసిక ఉత్సాహాన్ని పొందగలుగుతామని అన్నారు. నేడు మొక్కలను నాటడం భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారం అవుతామని చెప్పారు. మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని నర్సరీల్లో పెరిగిన మొక్కలను అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

సెప్టెంబరు 5 వరకు నర్సరీ మేళా..

మేళా ఇంచార్జీ ఖాలీద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. నర్సరీలతో మేలు జాతి మొక్కలు, అంటుకట్టిన మొక్కలు అందుబాటులోకి తెచ్చామని మేళ ఇంచార్జ్ ఖాలీద్‌ అహ్మద్‌ తెలిపారు. ఈ మేళ సెప్టెంబరు 5 వరకు ఉదయం 9గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పూలు, పండ్లు, గార్డెనింగ్ లాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అన్ని ఒకే చోట దొరుకుతాయన్నారు. నగర వాసులకు ఇదో మంచి అవకాశమని, హోంగార్డెన్‌, టెర్రస్‌ గార్డెన్‌, వర్టికల్‌ గార్డెన్‌, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచివేదిక అని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి 150కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టాల్స్‌లో అరుదైన మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పరికరాలు ప్రదర్శన, విక్రయాలు జరుగుతాయన్నారు. నర్సరీలతో మేలు జాతి మొక్కలు, అంటుకట్టిన మొక్కలు అందుబాటులోకి తెచ్చామని ఖాలీద్‌ అహ్మద్‌ వివరించారు.


Similar News