రైతుల కోసం బమ్మెరలో ‘న్యాయ సహాయ కేంద్రం’

పోతన నాగలి పట్టి దున్నిన నేలపై రైతుల కోసం న్యాయ సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.

Update: 2023-03-17 12:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పోతన నాగలి పట్టి దున్నిన నేలపై రైతుల కోసం న్యాయ సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో తెలంగాణ న్యాయ సేవల అథారిటీ, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, లీగల్ ఎంపర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ(లీఫ్స్) సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్ ఈ క్లినిక్‌ను ప్రారంభించనున్నారు. రైతులకు వ్యవసాయ సంబంధిత సమస్యలపై ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందించడం కోసం ఈ క్లినిక్ పని చేస్తుంది. ఇలాంటి క్లినిక్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది మొదటి సారి.

దుక్కి దున్నే నాటి నుంచి పండించిన పంటను మార్కెట్లో అమ్మేదాకా రైతులు ఎదుర్కునే సమస్యలు ఎన్నో ఉన్నాయి. రైతుల మేలు కోసం ప్రభుత్వం పలు చట్టాలు చేసింది. చట్టాలు తెలిసి ఉండి, వాటిని వినియోగించుకొగలిగితేనే ఏరువాక సాఫీగా సాగేది. భూమి సమస్యలు ఉత్పన్నమైనపుడు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లినప్పుడు, మార్కెట్ మోసాలు జరిగినప్పుడు, పంటల బీమా అందనప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో చట్టంతో రైతులకు అవసరం ఏర్పడుతుంది. సమస్యల పరిష్కారానికి అధికారులను ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు, కోర్టులకు వెళ్లాల్సి వచ్చినపుడు న్యాయ సేవలను పొందడం అవసరం.

కానీ, చట్టాలపై అవగాహన లేక, న్యాయ సహాయం అందక రైతులు వారికి మేలు చేసే చట్టలున్నా లబ్ధి పొందలేకపోతున్నారని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొ.డా.పి.శ్రీకృష్ణదేవరావు, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) అధ్యక్షుడు ఎం.సునీల్ కుమార్(భూమి సునీల్), తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షులు కరుణాకర్​దేశాయిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి తగు న్యాయ సేవలు అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మొదటి ప్రయత్నంగా బమ్మెర గ్రామంలో "అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్" ప్రారంభమవుతుందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ పి.వి.సంజయ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయన్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఎక్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్ రావు తదితరులు పాల్గొంటారు.

Tags:    

Similar News