కోడ్ ముగియగానే పాలనపై ఫోకస్.. ఫస్ట్ ప్రియారిటీ ఇదే..!

లోక్ సభ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వం పాలనతో పాటు అభివృద్ధిపై ఫోకస్ పెట్టనున్నది.

Update: 2024-05-29 01:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్ సభ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వం పాలనతో పాటు అభివృద్ధిపై ఫోకస్ పెట్టనున్నది. ఫస్ట్ ఫేజ్‌లో మూసీ నది సుందరీకరణ పనులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేయాలని సర్కార్ భావిస్తోంది. మూసీ నది సుందరీకరణ కోసం ఇప్పటికే 15 టెండర్లు రాగా, అందులో నిబంధనల ప్రకారం 7 టెండర్లు అర్హత పొందినట్లు తెలిసింది. వీటిలో త్వరలోనే ఎల్ 1, ఎల్ 2ను ఎంపిక చేసి సుందరీకరణ పనులు మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మూసీ రివర్‌పై అక్రమంగా నిర్మించిన 12 వేల అక్రమ కట్టడాలను విడతల వారీగా తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బ్యూటిఫికేషన్‌లో భాగంగా ఈస్ట్, వెస్ట్ సిటీలను కలుపుతూ గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీపై 55 కిలోమీటర్ల మేర రెండు వైపులా అత్యాధునిక ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు. మూసీకి అనుకొని కమర్షియల్ కాంప్లెక్స్ లు, వాటర్ ఫాల్స్, లైటింగ్స్, గ్రీనరీ, స్పోర్ట్స్ గేమింగ్ మాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

హెచ్ఎండీఏకు కొత్త ఆఫీసర్లు..?

హెచ్ఎండీఏలో భారీ మార్పులు చోటు చేసుకునే చాన్స్ ఉన్నట్లు సమాచారం. తప్పిదాలు, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లను తప్పించి కొత్త వాళ్లకు చోటు కల్పించాలనేది ప్రభుత్వం నిర్ణయం. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి వరుసగా హెచ్ఎండీఏ, మున్సిపల్ శాఖ అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ముసీ నది ప్రక్షాళన, సుందరీకరణ, హెచ్ఎండీఏ విస్తరణ వంటి ప్రోగ్రాములను సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొత్త కమిషనర్‌ను నియమించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో శ్రీదేవి, ఆమ్రపాలి ఉన్నట్లు సమాచారం.

వైద్యశాఖలో కూడా..?

వైద్యారోగ్యశాఖలోనూ భారీగా బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్లు టాక్. ఏపీకి వెళ్లిన హెచ్‌వోడీ పోస్టులను క్రియేట్ చేస్తూ, సీనియారిటీ ప్రకారం ఆయా పోస్టుల్లో అధికారులను నియమించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ వంటి విభాగాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు టీఎస్ఎంఎస్ఐడీసీలోనూ కొత్త అధికారులు, స్టాఫ్‌ను నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే సమర్థవంతమైన అధికారులు, స్టాఫ్ వివరాలను ప్రభుత్వం సేకరించినట్లు తెలిసింది. కోడ్ ముగిసిన మరుక్షణమే స్థాన చలనాలకు సర్కార్ శ్రీకారం చుట్టనున్నది.


Similar News