AEE అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాల్సిందే.. హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్ ఇదే..
నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటిన ఏఈఈ అభ్యర్థుల అంశం కొలిక్కి రాకపోవడంతో ఇవాళ గాంధీభవన్ ముందు అభ్యర్థులు నిరసన చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటిన ఏఈఈ అభ్యర్థుల అంశం కొలిక్కి రాకపోవడంతో ఇవాళ గాంధీభవన్ ముందు అభ్యర్థులు నిరసన చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా హరీశ్ రావు స్పందించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. గాంధీభవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న ఏఈఈ అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు మంత్రులకు, వారు అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేక పోయిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు.